అసలు సాధ్యమే కాదని భావించింది నిజమయ్యింది. రాజమౌళి రికార్డులు మళ్ళీ ఆయనే తప్ప ఇంకెవరు బ్రేక్ చేయలేరనే వాదన బద్దలయ్యింది. సంవత్సరాల తరబడి నాన్ బాహుబలి పదానికి అలవాటు పడిన ట్రేడ్ కి కొత్త నిర్వచనం దక్కింది.
పుష్ప 2 ది రూల్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యథిక వసూళ్లు సాధించిన నెంబర్ వన్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. అది కూడా కేవలం 32 రోజుల వ్యవధిలో కావడం అనూహ్యం. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం పుష్ప 2 వరల్డ్ వైడ్ సాధించిన గ్రాస్ అక్షరాలా 1831 కోట్ల రూపాయలు.
ఇది ఎప్పుడూ చూడని చరిత్ర. కమర్షియల్ అంశాలున్న ఒక మాస్ మూవీ ఎలాంటి గ్రాఫిక్ కంటెంట్ మీద ఆధారపడకుండా ఇలాంటి ఫీట్ సాధించడం అనూహ్యం. బాలీవుడ్ లో తలలు పండిన అమితాబ్, షారుఖ్, సల్మాన్, అమీర్ లాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కానీ ఫీట్ పట్టుమని పాతిక సినిమాలు లేని అల్లు అర్జున్ సాధించడం తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి చేరుకుందో చెప్పేందుకు చక్కని ఉదాహరణ.
ఇటీవలే ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో నాగవంశీ అన్నట్టు నిజంగానే ఉత్తరాది నిర్మాతలకు మన టాలీవుడ్ సత్తా చూసి నిద్రలేని రాత్రుళ్ళు భవిష్యత్తులో ఎన్నో ఎన్నెన్నో రాబోతున్నాయి.
నెల రోజులు పూర్తి చేసుకున్న పుష్ప 2 ఇంకా ఫైనల్ రన్ ముగించలేదు. నిన్న ఆదివారం కూడా బుక్ మై షోలో 90 వేలకు పైగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మిన సినిమా ఇదొక్కటే. మార్కో, మ్యాక్స్ లాంటి పాజిటివ్ టాక్ వచ్చినవి రెండో వారంలో కనీసం ఇందులో సగం కూడా సాధించలేకపోయాయి.
దీన్ని బట్టే పుష్పరాజ్ మాస్ లో ఎంతగా చొచ్చుకుపోయాడో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సందడి జనవరి 10 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మన సౌత్ లో పుష్ప 2 జోరు దాదాపుగా తగ్గినట్టే. కానీ సరైన బాలీవుడ్ మూవీ లేని కారణంగా నార్త్ లో మాత్రం బన్నీ హవా 50 రోజుల దాకా థియేటర్లలో కొనసాగేలా ఉంది.