దేవి వాహ్…చైతు & సాయిపల్లవి వారెవ్వా

నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తండేల్ నుంచి నిన్న ఓం నమః శివాయ అంటూ సాగే జాతర పాట రిలీజయ్యింది. ప్రత్యేకించి ఈ సాంగ్ మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత బన్నీ వాస్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దీని చిత్రీకరణ గురించి గొప్పగా చెప్పారు.

థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో దర్శకుడు చందూ మొండేటి చిత్రీకరించాడని తెగ ఊరించారు. దానికి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ తో అదరగొట్టగా రెండు కళ్ళు చాలవనే రీతిలో చైతు, సాయిపల్లవిలు పోటీపడి నృత్యం చేయడం నయనానందకరంగా సాగింది.

గతంలో ఇలాంటి నేపథ్యతోనే డమరుకం క్లైమాక్స్ కోసం దేవిశ్రీ ప్రసాద్ శివుడి మీద ఒక పాటను చేశాడు. అది ఎంత పెద్ద ఛార్ట్ బస్టర్ అంటే ప్రతి ఏడాది ఒక న్యూస్ ఛానల్ నిర్వహించే అతి పెద్ద కోటి దీపోత్సవంకు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా దీన్నే వాడుకుంటారు. శివరాత్రి మండపాల్లో ఇది వినిపించని ఊరు ఉండదు.

తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ తండేల్ కోసం కొట్టాడు దేవి. రెగ్యులర్ లిరిక్ రైటర్స్ ని కాకుండా భక్తి, ఆధ్యాత్మికత మీద అపారమైన పట్టున్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో పాట రాయించడం గొప్ప సాహిత్యం వచ్చేలా చేసింది. తండేల్ ఆల్బమ్ లో ఇది బెస్ట్ ట్రాక్ గా నిలిచినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ఓం నమః శివాయకు రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాకపోతే నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్టుగా రావడం, బాబాయ్ అబ్బాయి వీడియోలు స్పీచుల మీదే సోషల్ మీడియా దృష్టి పెట్టడంతో తండేల్ పాట కొంచెం వెనుక బడింది.

ఆదివారం తెల్లవారడం ఆలస్యం డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేయడంతో ఆ ప్రభావం మరింత తోడయ్యింది. ఇవి చాలవన్నట్టు బాలకృష్ణ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ట్రైలర్ హల్చల్ చేసింది. ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్నా రాబోయే రోజుల్లో ఓం నమః శివాయ ప్రతి చోటా మారుమ్రోగడం ఖాయం.