హీరోయిన్లు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వెల్లడించడం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న దశలో ఆ రంగంలోకి అడుగు పెట్టడం కొత్తేమీ కాదు. ఈ కోవలో ఎంతోమందిని చూశాం. కానీ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా జయలలిత పేరే చెప్పుకోవాలి. ఐతే ఆమె నేరుగా సీఎం అయిపోవాలన్న లక్ష్యంతో ఏమీ రాజకీయాల్లోకి రాలేదు.
ఎంజీఆర్ అనుయాయురాలిగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న క్రమంలో పట్టుబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. మొండి పట్టుదలతో పోరాడి అత్యున్నత పదవిని స్వీకరించారు. ఆమెకు ముందు, తర్వాత సీఎం పదవి గురించి ఏ కథానాయిక కల కూడా కని ఉండదు. ఐతే ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ త్రిష తనకీ లక్ష్యం ఉన్నట్లు వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఎప్పటికైనా తమిళనాడు సీఎం కావాలన్నది తన కోరిక అని ఆమె ఆశ్చర్యకర ప్రకటన చేసింది. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని అభిప్రాయపడింది. త్రిష వ్యాఖ్యలు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. త్రిష 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది ఇటీవలే. ఆమె చాలా ఏళ్ల కిందటే సినిమాలు వదిలేసి వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని అనుకుంది.
కానీ వరుణ్ మణియన్‌తో ఎంగేజ్మెంట్ రద్దవడం.. మళ్లీ కెరీర్ పుంజుకోవడంతో సినిమాల్లో కొనసాగింది. ఇప్పుడు వయసు 40 పైబడ్డా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కానీ ఇప్పటిదాకా ఎన్నడూ త్రిష రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. తాను ఆ రంగంలోకి వస్తాననే సంకేతాలు కూడా ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు సడెన్‌గా ఒకేసారి ముఖ్యమంత్రి పదవి లక్ష్యమని పేర్కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరో విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న వేళ.. అతడి సన్నిహితురాలైన త్రిష ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.