భీమ్స్‌కు ‘మెగా’ ఛాన్స్?

టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్‌ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ కష్టాల గురించి చెబితే కన్నీళ్లు వస్తాయి. ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకోవడానికి అతను చాలా కష్టాలే పడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇతని వెనుక ఇంత దీనమైన కథ ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది తన ప్రయాణం గురించి తెలుసుకుంటే. ఐతే తన కష్టానికి ఇప్పుడు సరైన ఫలితమే దక్కుతోంది. డీజే టిల్లు, ధమాకా, మ్యాడ్.. ఇలా వరుస మ్యూజికల్ హిట్లతో అతను దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో అతడి లీగ్ మారిపోయింది. అగ్ర హీరో వెంకటేష్ సినిమాకు సంగీతాన్నిచ్చే అవకాశం దక్కితే దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ పాటలు హోరెత్తిపోతున్నాయి. విడుదలకు ముందే మ్యూజిక్ పరంగా సినిమా పెద్ద హిట్టయిపోయింది.ఈ నేపథ్యంలో అమితానందంలో ఉన్న భీమ్స్‌కు మరో తీపి కబురు చెప్పాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అతను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ చిత్రానికి కూడా భీమ్స్‌నే సంగీత దర్శకుడిగా తీసుకుంటానని అతను ప్రకటించాడు.

చిరంజీవి సినిమా అంటే యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, అభిమానులకు నచ్చే అంశాలు అన్నీ ఉంటాయని చెప్పిన అనిల్.. భీమ్స్‌తోనే సంగీతం చేయిస్తానని ప్రకటించాడు. ఐతే చిరు సినిమా అంటే అనిల్‌దే ఫైనల్ డెసిషన్ కాకపోవచ్చు. చిరు అండ్ టీం నటీనటులు, టెక్నీషియన్ల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తుంది.

మరి వాళ్లు కూడా భీమ్స్ పట్ల సంతృప్తి చెంది అతడినే ఖరారు చేస్తారేమో చూడాలి. అదే జరిగితే మాత్రం భీమ్స్ ఇంకో లెవెల్‌కు వెళ్లబోతున్నట్లే. వెంకీ సినిమా ఛాన్స్ దక్కినందుకే అతడి ఆనందం అంతా ఇంతా కాదు. ఇక చిరు సినిమా ఓకే అయితే తన సంబరం పతాక స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు.