అడవి దొంగల వేటగాడు ‘డాకు మహారాజ్’

వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ సంక్రాంతి పండక్కు డాకు మహారాజ్ గా వస్తున్నారు. కమర్షియల్ అంశాలతోనే ఎప్పుడూ చూడని ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా ఇస్తామని నిర్మాత నాగవంశీ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పడంతో అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇప్పటిదాకా కథకు సంబంధించిన క్లూస్ ఇచ్చేలా ఎలాంటి కంటెంట్ వదలకపోవడంతో అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. అమెరికా డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ లాంఛనం పూర్తయ్యింది. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చాడు.

అనగనగా జనం రాజుగా పిలుచుకునే ఒక మంచివాడు (బాలకృష్ణ). బందిపోట్ల పాలిట సింహస్వప్నం. హఠాత్తుగా ఒక రోజు నానాజీగా స్కూలుకు వెళ్లే పాప ముందు ప్రత్యక్షమవుతాడు. తర్వాత కొన్ని రోజులకు మరో వేషంలో సీతారాంగా దర్శనమిస్తాడు.

ఇంకోవైపు బయటికి కనిపించని ఒక చీకటి ప్రపంచంలో జంతువులతో వ్యాపారం చేసే ఒక రాక్షసుడు (బాబీ డియోల్) వల్ల ప్రజలు బానిసలుగా మారి కష్టాలు పడుతూ ఉంటారు. అసలు డాకు అంటే ఎవరు, అతనికి పాపకు ఉన్న సంబంధం, శత్రువులతో ఏర్పడిన వైరంలో ఎవరెవరు భాగమయ్యారు అనే ప్రశ్నలకు సమాధానం జనవరి 12 థియేటర్లలో చూడాలి.

విజువల్స్ అంచనాలకు మించి చాలా స్టయిలిష్ గా ఉన్నాయి. మూడు షేడ్స్ లో బాలకృష్ణ గెటప్ ఆసక్తి రేపుతోంది. భారీ డైలాగులు తగ్గించి కంటిచూపు, ఎక్స్ ప్రెషన్లతో బాబీ చేయించిన ప్రయోగం కొత్తగా అనిపిస్తోంది. కెజిఎఫ్ తరహాలో ఇంకో వరల్డ్ సృష్టించిన వైనం, టెక్నికల్ గా తీర్చిదిద్దిన విధానం హైప్ పెంచడం ఖాయం. కొన్ని జంతువుల సిజి షాట్స్ టాప్ క్వాలిటీ లో ఆసక్తి రేపుతున్నాయి.

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభిన్నమైన సౌండ్ తో ఎలివేట్ చేయగా ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, రవిశంకర్, టామ్ షైన్ చాకో తదితరుల పాత్రలను చూపించి చూపించనట్టు కట్ చేశారు. అంచనాలకు మించి డాకు మహారాజ్ ఉండబోతున్నాడనే నమ్మకాన్ని డాకు మహారాజ్ ఇచ్చేశాడు.