‘డాకు’ పై హైప్ ఎక్కిస్తున్న నాగవంశీ

తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి మాటలూ నమ్మలేం. వాళ్లు చెప్పే మాటలకు.. సినిమాలో విషయానికి అసలు సంబంధమే ఉండని సందర్భాలు ఎన్నో. కానీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకడైన నాగవంశీ మాటలకు కొంచెం క్రెడిబిలిటీ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన జోస్యాలు కూడా తప్పాయి కానీ.. కొన్ని సినిమాల విషయంలో మాత్రం నాగవంశీ చెప్పింది వాస్తవమే అనుకున్నారు ప్రేక్షకులు.

‘మ్యాడ్’ సినిమా రిలీజైనపుడు ‘జాతిరత్నాలు’ కంటే ఎక్కువ నవ్వుతారు అంటూ ఛాలెంజ్ చేశాడు నాగవంశీ. నిజంగానే యువ ప్రేక్షకులకు ఆ సినిమా చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు. ‘జాతిరత్నాలు’ను మించి కాకపోయినా.. దానికి దీటైన కామెడీ ఉంది ఆ చిత్రంలో. ఇక ‘లక్కీ భాస్కర్’ విడుదల ముంగిట ఇందులో లోపాలు చూపిస్తే పార్టీ ఇస్తానన్నారు నాగవంశీ. ఆ సినిమా చూస్తే నిజంగా అది పర్ఫెక్ట్ మూవీ అనిపించింది.

ఇప్పుడిక సితార సంస్థలో వస్తున్న కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ విషయానికి వస్తే.. దీని గురించి కూడా ఒక రేంజిలో చెబుతున్నాడు నాగవంశీ. సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్ మీట్లోనే.. చిరు తో తీసిన సినిమా కంటే ‘డాకు మహారాజ్’ను దర్శకుడు బాబీ బాగా తీశాడని వ్యాఖ్యానించాడు. తాజాగా నందమూరి అభిమానులతో స్పేస్‌లో పాల్గొన్న నాగవంశీ.. ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి హైప్ ఎక్కించాడు.

ఒక 20 నిమిషాల పాటు అభిమానులు సీట్లలో కూర్చోరని.. పేపర్లు విసురుతూనే ఉంటారని.. ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అని నాగవంశీ అన్నాడు. మరోవైపు ఇంటర్వెల్‌ తర్వాత ద్వితీయార్దంలో వచ్చే మరో ఎపిసోడ్ గురించి ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు వంశీ. ‘చెన్నకేశవరెడ్డి’లో పెళ్లి సీన్ సందర్భంగా గొడ్డలి తీసుకుని బాలయ్య తాండవం చేసే సీన్ ఉంటుంది.

దాన్ని రెఫరెన్సుగా తీసుకుని మాస్‌ను రీడిఫైన్ చేసిన సీక్వెన్స్ అని పేర్కొంటూ.. ‘డాకు మహారాజ్’లోనూ ద్వితీయార్దంలో దీన్ని మ్యాచ్ చేసే సీన్ ఉంటుందంటూ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచే ప్రయత్నం చేశాడు. మరి నాగవంశీ చెబుతున్నంతగా ‘డాకు మహారాజ్’లో హైలైట్లు పేలుతాయేమో చూడాలి.