ఖుష్బుకు తండ్రి అంత నరకం చూపించాడా?

తమిళ సీనియర్ నటి ఖుష్బు.. తన తండ్రి నుంచే తాను చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న షాకింగ్ విషయాన్ని గతంలోనే వెల్లడించింది. ‘మీ టూ’ మూమెంట్ మొదలయ్యాక ఆమె ఈ విషయంలో ఓపెన్ కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయమై మరింత వివరంగా మాట్లాడింది. మిగతా కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు తన తండ్రి చేసిన అఘాయిత్యాలను చాలా కాలం భరించినట్లు ఆమె వెల్లడించింది.

తాను నటి అయ్యాక కూడా షూటింగ్ స్పాట్‌కు వచ్చి తనను కొట్టేవాడంటూ తండ్రి కర్కశత్వాన్ని ఆమె బయటపెట్టింది. నటిగా స్థిరపడ్డాక తాను అతణ్ని ఎదిరించడం మొదలుపెట్టినట్లు తెలిపింది. ఈ విషయమై ఖుష్బు ఇంకా ఏమందంటే..

“చిన్నతనంలోనే నేను లైంగిక దాడులు ఎదుర్కొన్నా. స్వయంగా నా తండ్రే నా మీద ఈ దారుణాలకు పాల్పడ్డాడు. నా తల్లి, సోదరులను అతను చిత్రహింసలు పెట్టేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర ఇలా చేతికి ఏది దొరికితే అది తీసుకుని కొట్టవాడు. కొన్నిసార్లు అమ్మను దారుణంగా హింసించేవాడు. ఆమె తలను గోడకు కొట్టిన సందర్బాలు ఉన్నాయి. చిన్నతనంలోనే నేను దారుణమైన వేధింపులు చూశా. నా మీద లైంగిక దాడికి పాల్పడ్డా ఏమీ చేయలేని పరిస్థితి. విషయం బయటికి చెబితే నన్ను, వాళ్లను ఇంకెంత నరకయాతనకు గురి చేస్తాడో అని భయపడ్డా.

చెన్నైకి వచ్చి నటిగా నా కాళ్ల మీద నేను నిలబడే వరకు ఈ వేధింపులను భరించా. ఆ తర్వాత ఎదురు తిరగడం మొదలుపెట్టా. కానీ అతను నా ప్రతిఘటనను తట్టుకోలేకపోయాడు. షూటింగ్‌కు వచ్చి అందరి ముందు నన్ను కొట్టేవాడు. అలాంటి సమయంలో ఉబిన్ అనే హెయిర్ డ్రసర్ నాకు సాయం చేసింది. అతడి ప్రవర్తన సరిగా లేదని గుర్తించి, తనను ఎలా ఎదుర్కోవాలో చెప్పి, ధైర్యం నూరిపోసింది. అలా మొదటిసారి నాకు 14 ఏళ్ల వయసుండగా నాకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి బయటికి వచ్చి మాట్లాడా. దీంతో అతను మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. నేను అతడి ఆచూకీ తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. తర్వాత ఎప్పుడూ అతణ్ని కలవలేదు. గత ఏడాది అతను మరణించాడని తెలిసిన వాళ్లు చెప్పారు” అని ఖుష్బూ వెల్లడించింది.