‘నువ్వే కావాలి’ తరుణ్ ఇప్పుడెలా ఉన్నాడంటే..

సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ తనయుడిగా చిన్నతనంలోనే తెరంగేట్రం చేసి అంజలి, తేజ, ఆదిత్య 369 లాంటి అనేక సినిమాలతో మంచి పేరు సంపాదించి.. జాతీయ ఉత్తమ బాల నటుడిగా అవార్డు కూడా అందుకున్న నటుడు తరుణ్. ఆ తర్వాత టీనేజీలోనే హీరోగా మారి అతను చేసిన ‘నువ్వే కావాలి’ ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం విడుదలై మంగళవారానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తరుణ్ లైన్లోకి వచ్చాడు. ‘20 ఏళ్ల నువ్వే కావాలి’ వేడుకలు చేసుకున్నాడు. చాలా ఏళ్లుగా అస్సలు లైమ్ లైట్లో లేని తరుణ్ ఇప్పుడెలా ఉన్నాడన్నది కూడా జనాలకు ఐడియా లేదు. ఇలాంటి టైంలో అతణ్ని చూడటం ఒకప్పటి అతడి అభిమానులకు ఆనందాన్నిచ్చింది. ఒకప్పటితో పోలిస్తే తరుణ్ గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.

బాగా జుట్టు పెంచుకుని, మీసం తీసేసి కొత్త లుక్‌లోకి మారాడు తరుణ్. ‘నువ్వే కావాలి’లో నటించిన తరుణ్, ఇతను ఒకరే అంటే నమ్మబుద్ధి కావడం లేదు. అప్పట్లో ఆ ఒక్క సినిమాతో తరుణ్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అందం, అభినయం రెండూ ఉన్న తరుణ్‌‌కు వరుస బెట్టి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వే నువ్వే’ లాంటి హిట్లు అతణ్ని ఇంకా పెద్ద రేంజికి తీసుకెళ్లాయి.

ప్రామిసింగ్ యాక్టర్‌గా, స్టార్‌గా చాలా ఏళ్లు వెలుగొందుతాడనుకున్న ఈ హీరో.. అనూహ్యంగా తర్వాతి కాలంలో డౌన్ అయిపోయాడు. ఒక దశాబ్దం పాటు ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చిన అతను.. ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితి వచ్చింది. చివరగా రెండేళ్ల కిందట తరుణ్ నుంచి వచ్చిన ‘ఇది నా లవ్ స్టోరీ’ వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. ఆ తర్వాత అతడి నుంచి మరో సినిమా రాలేదు. ఈ మధ్య అతను ‘బిగ్ బాస్’లో పాల్గొంటాడని వార్తలొచ్చాయి కానీ.. వాటిని అతను ఖండించాడు.