ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా ఎదిగిన జానీ మాస్టర్.. కొన్ని నెలల కిందట ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన దగ్గర చాలా ఏళ్ల పాటు పని చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మీద తీవ్ర స్థాయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడం.. ఈ కేసులో అరెస్టయిన జానీ కొన్ని వారాల పాటు జైల్లో గడపడం.. ఆపై బెయిల్ మీద విడుదల కావడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. జానీకి ప్రకటించిన జాతీయ అవార్డును సైతం ఈ కేసు వల్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. బయటికి వచ్చాక ఈ కేసు లోతుల్లోకి వెళ్లకుండా తాను నిర్దోషినని మాత్రం చెబుతున్నాడు జానీ.
ఐతే ఇది సున్నితమైన కేసు కావడం వల్ల జానీకి మద్దతుగా మాట్లాడ్డానికి ఇండస్ట్రీ ప్రముఖులు వెనుకంజ వేస్తున్నారు. జానీకి సన్నిహితులు, అతను ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సైతం ఈ కేసు విషయంలో నోరు మెదపలేదు. నాగబాబు మాత్రం కోర్టు నిర్ణయించే వరకు ఎవరూ దోషులు కారంటూ జానీకి మద్దతుగా ఒక ట్వీట్ వేశారు.
పవన్, చరణ్ జానీ కేసు విషయంలో మౌనం వహించడాన్ని కొందరు విమర్శించారు. కొందరు సమర్థించారు. ఇంతకీ ఈ విషయంలో జానీ స్పందన ఏంటి అన్నది ఆసక్తికరం. అతను ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడాడు. “ఇలాంటి కేసుల్లో ఎవరూ ఏమీ మాట్లాడకపోవడమే మంచిది. పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు అంటే నాకు చచ్చేంత ఇష్టం. వాళ్లకూ నేనంటే అభిమానం. వాళ్లు నాకు మద్దతుగా మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ల మీద నాకున్న ప్రేమ తగ్గదు. ఈ కేసుకు, ఆ అభిమానానికి సంబంధం లేదు. కొన్నిసార్లు సైలెన్సే ఉత్తమమైన పరిష్కారం. ఈ విషయంలోనూ అంతే. నా మీద ఆరోపణలు వచ్చాయి. దాన్ని నేనే పరిష్కరించుకుని బయటిక నిర్దోషిగా రావాలన్నది కళ్యాణ్ గారు, చరణ్ గారి ఉద్దేశం అనుకుంటున్నా. అలాగే బయటికి వస్తా. నాకు మద్దతుగా ట్వీట్ వేసిన నాగబాబు గారికి, మద్దతుగా మాట్లాడిన అందరికీ నేను రుణపడి ఉంటా” అని జానీ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates