రామ్ చరణ్ కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా విడుదల బాగా ఆలస్యమైంది. గత ఏడాది దసరా టైంకే రిలీజ్ చేయాలనుకుని.. అంతకు ఆరు నెలల ముందే ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన తొలి పాట.. జరగండి జరగండి. శంకర్ మార్కు భారీ విజువల్స్.. తమన్ మార్కు బీట్‌తో ఈ పాట బాగానే ఆకట్టుకుంది.
ఐతే ఒకసారి ఆడియో సాంగ్ రిలీజ్ చేశారంటే.. ఇక అదే ట్రాక్ సినిమాలోనూ పెట్టేస్తారు. మధ్యలో మార్పులు చేర్పులంటూ ఏమీ ఉండవు. కానీ ఈ పాటకు మాత్రం తమన్ మళ్లీ వర్క్ చేశాడట. ఆడియోలో విన్నదానికంటే స్క్రీన్ మీద ఇంకా బెటర్‌గా ఉండేలా అడిషన్స్ చేశారట. ఇలా ఎప్పుడో కానీ జరగదు. కానీ ‘జరగండి’ పాట ఫైనల్ విజువల్స్ చూశాక తాను ఆ పాటను అలా వదిలేయలేకపోయానని అంటున్నాడు సంగీత దర్శకుడు తమన్.
‘గేమ్ చేంజర్’కు సంబంధించి జరిగిన ఒక ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న తమన్.. ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఇటీవలే సీజీతో పాటు అన్ని హంగులూ పూర్తయిన ‘జరగండి’ పాట విజువల్స్‌ను తనకు శంకర్ పంపించాడని.. అది చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయానని తమన్ చెప్పాడు. ఈ సాంగ్ నమ్మశక్యం కాని విధంగా, విజువల్ ఫీస్ట్‌గా ఉంటుందని అతను తెలిపాడు.
ఈ విజువల్స్ చూశాక పాటను ఇంతకుముందు ఉన్నట్లే వదిలేయడానికి తనకు మనసు ఒప్పలేదని.. దీంతో డ్రమ్మర్ శివమణితో పాటు మ్యుజీషియన్లను.. అలాగే సింగర్స్‌ను మళ్లీ పిలిపించి.. కొన్ని ఆకర్షణలు జోడించామని.. కాబట్టి రేప్పొద్దున థియేటర్లలో ఈ సాంగ్ మామూలుగా ఉండదని.. ఎవ్వరూ సీట్లలో కూర్చోరని తమన్ ఎలివేషన్ ఇచ్చాడు. ఇక సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని చెప్పిన తమన్.. త్వరలోనే హీరో మీద వచ్చే ఒక ఇంటెన్స్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. పాటలన్నీ విజువల్‌గా కూడా అద్భుతంగా ఉంటాయని అతను హామీ ఇచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates