టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ఆర్టిస్టులకు పవన్ గతంలో అనేక సార్లు ఆపన్న హస్తం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు పవన్ తాజాగా ఆర్థిక సాయం చేసిన వైనం వైరల్ గా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు అధిక షుగర్ తో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవన్ అండగా నిలిచారు.
నూతన సంవత్సరం సందర్భంగా పవన్ తనుకు చేసిన సాయాన్ని వెల్లడిస్తూ ఫిష్ వెంకట్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. కొంతకాలం క్రితం కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, దీంతో, రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ చెప్పారు. అనారోగ్యంతో సినిమాలకు దూరం అయ్యానని, ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు. తన భార్య సువర్ణ ఒత్తిడి చేయడంతో పవన్‌ను కలిశానని వెల్లడించారు.
పవన్‌ను కలిసిన తర్వాత ఆయన తనకు భరోసానిచ్చారని, అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఫిష్ వెంకట్ అన్నారు. తన బ్యాంకు ఖాతాలో వెంటనే రూ. 2 లక్షలు పవన్ జమ చేయించారని, తమ కుటుంబం పడుతున్న ఆర్థిక కష్టాలు విని పవన్ చలించిపోయారని వెంకట్ అన్నారు. తన కిడ్నీ చికిత్స కోసం కూడా పవన్ సాయం చేస్తారని హామీనిచ్చారని తెలిపారు.
ఈ కష్టకాలంలో తనను ఆదుకున్న పవన్ తనకు దేవుడని, ఆయన కుటుంబం ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తానని భావోద్వేగానికి గురయ్యారు. వీడియో చివర్లో పవన్ స్టైల్లో ఫిష్ వెంకట్ న్యూ ఈయర్ విషెస్ చెప్పిన ఆ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది
Gulte Telugu Telugu Political and Movie News Updates