తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాలపై, డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమాలపై సినీ ప్రముఖులు ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పిలుపునకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా ‘‘సే నో టు డ్రగ్స్ డార్లింగ్స్’’ అంటూ డ్రగ్స్ వ్యతిరేక అవకగాహనా కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభించారు.
డ్రగ్స్ వద్దు అంటూ యువత, ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రభాస్ ఓ వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నారని ప్రభాస్ చెప్పారు. అటువంటపుడు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ తన అభిమానులతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ సందేశమిచ్చాడు.
జీవితంలో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని, డ్రగ్స్‌కు నో చెప్పాలని బాహుబలి తన స్టైల్లో పిలుపునిచ్చారు. అంతేకాదు, మన స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వెంటనే 87126 -71111 నెంబర్కు ఫోన్ చేయాలని ప్రభాస్ చెప్పారు. డ్రగ్స్కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ప్రభాస్ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరగబోయే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దాంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే పలు సామాజిక కార్యక్రమాలపై కూడా టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే, కుల గణనపై ప్రచారం చేసేందుకు మాత్రం సినీ ప్రముఖులు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.