మరో సంవత్సరం ముగిసింది. కొత్త ఆశలతో స్వాగతం పలికేందుకు 2025 తయారయ్యింది. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన టాలీవుడ్ ప్రమాణాలను మరింత పైకి తీసుకెళ్లేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరింత కష్టపడబోతున్నారు. అమీర్ పేట్ నుంచి ఆస్కార్ దాకా ఎక్కడ చూసినా తెలుగు సినిమా ఖ్యాతి గురించి చర్చించుకునేలా చేయడంలో 2024 కీలక పాత్ర పోషించింది. ఈ 12 నెలల కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేసుకుని స్ట్రెయిట్ టాలీవుడ్ సినిమాల రివ్యూగా చూద్దాం.
జనవరి
సంక్రాంతి ఈసారి సర్ప్రైజులిచ్చింది. థియేటర్లు ఎక్కువ దొరకడమే కష్టమైపోయిన హనుమాన్ రికార్డులు బద్దలు కొడుతూ బ్లాక్ బస్టరవ్వగా భారీ అంచనాలు మోసుకొచ్చిన గుంటూరు కారం వాటిని అందుకోలేక కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించుకోవడం ఊహించని పరిణామం. కొత్తగా సీరియస్ జానర్ ట్రై చేద్దామని చూసిన వెంకటేష్ సైంధవ్ ఏ వర్గాన్ని మెప్పించలేకపోవడం ఫ్యాన్స్ ని బాధించింది. నాగ్ నా సామిరంగా డీసెంట్ హిట్టు కొట్టేసి పండగ సంబరాన్ని నిలబెట్టింది. ఇవి కాకుండా సర్కారు నౌకరి, డబుల్ ఇంజిన్, రామ్, ప్రేమలో లాంటి చిన్న చిత్రాలు వచ్చాయి కానీ కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేక ఆడియన్స్ దృష్టిలో పడకుండానే మాయమైపోయాయి.
ఫిబ్రవరి
సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఓ మోస్తరుగా ఆడటం కొంత ఊరట. కలర్ ఫోటో రేంజ్ లో ఫలితాన్ని ఆశించారు కానీ యావరేజ్ కు ఒక మెట్టు పైన ఆగింది. జగన్ ని స్తుతిస్తూ తీసిన యాత్ర 2 నిరాశపరచగా రవితేజ ఈగల్ కంటెంట్ పరంగా వైవిధ్యంగా ఉన్నా మాస్ ని మెప్పించలేకపోయింది. రాజధాని ఫైల్స్ కాసింత హంగామా చేసినా వసూళ్లు రాలేదు, ఊరు పేరు భైరవకోన సందీప్ కిషన్ కు కాసింత సంతృప్తిని మిగిల్చింది. అర్జున్ రెడ్డి షేడ్స్ లో వచ్చిన సిద్దార్థ్ రాయ్ తిరస్కారానికి గురి కాగా వైవా హర్ష సుందరం మాస్టర్ కామెడీ జనాలకు ఎక్కలేదు. యునానిమస్ గా ఏ చిత్రం ఈ నెలలో ప్రభావం చూపించలేకపోవడం మూవీ లవర్స్ కి సోసో మంత్ గా నిలిచింది
మార్చి
థ్రిల్లర్ జానర్ ని నమ్ముకుని వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణలో ట్విస్టులు పబ్లిక్ ని మెప్పించేందుకు సరిపోలేదు. వెన్నెల కిషోర్ చారి 111కి సారీ ఎదురయ్యింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్ కాగా గోపీచంద్ భీమా కింది సెంటర్లలో ఓ మాదిరి వసూళ్లతో జస్ట్ ఓకే అనిపించుకుంది తప్ప కంబ్యాక్ కాలేకపోయింది. విశ్వక్ సేన్ గామికి ప్రశంసలు దక్కాయి. బడ్జెట్ రికవర్ అయ్యింది. వివాదంతో పబ్లిసిటీ చేసుకున్న రజాకార్ కు ఆదరణ దక్కలేదు. ఓం భీం బుష్ బడ్జెట్ కు తగ్గట్టు రాబట్టుకోవడంతో ఓకే క్యాటగిరీలో పడింది. నెలాఖరులో వచ్చిన టిల్లు స్క్వేర్ సిద్దు జొన్నలగడ్డకు మరో సూపర్ హిట్ ఖాతాలో వేసింది. మంత్ ఎండింగ్ ని బ్లాస్ట్ తో ముగించింది.
ఏప్రిల్
విజయ్ దేవరకొండకు మరో ఫ్లాపుని మూటగట్టిన ది ఫ్యామిలీ స్టార్ అభిమానులతో పాటు నిర్మాత దిల్ రాజుకూ షాకే. కోన వెంకట్ టీమ్ గీతాంజలిని మళ్ళీ తెచ్చినా థియేటర్లలో మాత్రం నో అనేశారు. ఈ నెలలో చిన్న సినిమాలు చాలా వచ్చాయి కానీ ఏవీ ప్రభావం చూపించలేదు. భరత నాట్యం, శ్రీరంగనీతులు, టెనెంట్, మార్కెట్ మహాలక్ష్మి, తెప్ప సముద్రం తదితరాలన్నీ టపా కట్టినవే. ఒకరకంగా చెప్పాలంటే ఈ నెల చాలా నీరసంగా గడిచిపోయి ఆక్యుపెన్సీలు లేక ఎగ్జిబిటర్లతో కేకలు పెట్టించాయి. బ్యాడ్ మంత్ గా చెప్పొచ్చు.
మే
అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కుతో చేసిన కామెడీ మిస్ ఫైర్ అయ్యింది. సుహాస్ ప్రసన్నవదనం టాక్ బాగున్నా అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. సత్యదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2 రెండూ తుస్సుమన్నాయి. రాజు యాదవ్ లో ఓవర్ ఎమోషన్ ని జనం భరించలేకపోయారు. దిల్ రాజు గొప్పగా చెప్పుకున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ రెండో రోజే చేతలు ఎత్తేసింది. ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అంతంతమాత్రంగానే అడగా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి మంచి ఓపెనింగ్స్ ని హిట్టుగా మల్చుకోలేకపోయింది.
జూన్
శర్వానంద్ మనమే మీద పెట్టుకున్న ఆశలపై నీళ్లు పడ్డాయి. కాజల్ అగర్వాల్ సత్యభామ, పాయల్ రాజ్ పూత్ రక్షణ రెండూ పోలీస్ ఆఫీసర్ల కథలతో దెబ్బ తిన్నాయి. సుధీర్ బాబు హరోంహరకు మాస్ సర్క్యూట్స్ నుంచి మద్దతు దక్కినా ఓవరాల్ గా హిట్ అనిపించుకోవడంలో తడబడింది. మ్యూజిక్ షాప్ మూర్తికి మెప్పులు తప్ప పైసలు రాలేదు. చివరి వారంలో కల్కి 2898 ఏడి ఉండటంతో ముందు వెనుక పోటీ వచ్చేందుకు ఎవరూ సాహసం చేయలేదు. వాళ్ళు భయపడినట్టే ప్రభాస్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొట్టేశాడు.
జూలై
నవదీప్ హీరోగా ఈ ఎంట్రీ ఇచ్చిన లవ్ మౌళిని ఎవరూ పట్టించుకోలేదు. పేకమేడలుకు కాంప్లిమెంట్స్ వచ్చినా థియేటర్ కు లాక్కొచ్చే టాక్ దక్కించుకోవడంలో తడబడింది. ప్రియదర్శి డార్లింగ్ ఘోరంగా దెబ్బ తినగా, ది బర్త్ డే బాయ్ కూసింత హంగామా తప్ప ఏం మిగల్లేదు. ఆపరేషన్ రావణ్, రాజ్ తరుణ్ పురుషోత్తముడుకి మొదటి రోజే డెఫిషిట్లు పడ్డాయి. కల్కి ఎఫెక్ట్ ఈ నెల కూడా కొనసాగడం వల్ల ఇతర నిర్మాతలు వాయిదా వేసుకున్న దాఖలాలు కనిపించాయి. డార్లింగ్ డామినేషన్ వల్ల ఇతరులకు ఛాన్స్ లేకుండా పోయింది
ఆగస్ట్
అల్లు శిరీష్ బడ్డీని తీసింది పెద్ద బ్యానరే అయినా మ్యాటర్ వీక్ ఉండటంతో తిరస్కారం తప్పలేదు. శివమ్ భజే పాయింట్ ఉన్నంత బలంగా ప్రెజెంటేషన్ లేకపోవడం బూమరాంగ్ అయ్యింది. నువ్వు నాకు నచ్చావ్ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ కొడుకుని హీరోగా పెట్టి తీసిన ఉషా పరిణయం కనీసం గుర్తుపట్టేలోగానే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. కమిటీ కుర్రాళ్ళు సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ కాగా, ఆయ్ పెద్దగా అంచనాలు లేకుండా విజయం అందుకుంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మాయని గాయాలు చేశాయి. మారుతినగర్ సుబ్రమణ్యం సోసోగా ఆడింది. నాని సరిపోదా శనివారం ఒక్కసారిగా 100 కోట్ల గ్రాసర్ గా మారి ఫుల్ కిక్కు ఇచ్చింది.
సెప్టెంబర్
స్టార్ క్యాస్టింగ్ లేని 35 చిన్న కథ కాదు మల్టీప్లెక్సుల్లో ముద్రవేసి బాలేదని ఎవరితో అనిపించుకోపోవడమే పెద్ద విజయంగా భావించాలి. రాజ్ తరుణ్ కు భలే ఉన్నాడే రూపంలో మరో దెబ్బ తప్పలేదు. మత్తు వదలరా 2ని సత్య తన టైమింగ్ తో నిలబెట్టిన తీరు వసూళ్లు కూడా తెచ్చింది. దేవర పార్ట్ 1 ని దృష్టి ఉంచుకుని ఎవరూ కాంపిటీషన్ కు వెళ్ళకపోవడంతో ఈ నెలలో పెద్దగా చెప్పుకోదగ్గ రిలీజులు లేకుండా పోయాయి. తొలుత డివైడ్ గా అనిపించిన టాక్ అనూహ్యంగా అయిదు వందల కోట్ల గ్రాస్ దాటించడం తారక్ కే చెల్లింది. రెండు మూడు వారాల పాటు థియేటర్లు కళకళలాడాయి. హిందీలోనూ మంచి సక్సెస్ అందుకోవడం జూనియర్ మార్కెట్ పరంగా ప్లసయ్యింది.
అక్టోబర్
శ్రీవిష్ణు స్వాగ్ తో పాటు సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో విడుదలకు ముందు ఉన్న పాజిటివ్ వైబ్స్ ని ఫలితంగా మార్చుకోలేకపోయాయి. విశ్వం రొటీన్ మూసలో వెళ్ళిపోయి గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరికీ చేదు ఫలితమే ఇచ్చింది. జనకా అయితే గనకకు చేసిన ప్రమోషన్లు ఫ్లాప్ నుంచి కాపాడలేకపోయాయి. లగ్గం, నరుడి బ్రతుకు నటనను విమర్శకులు మెచ్చుకున్నా లాభం లేకపోయింది. నెలాఖరులో వచ్చిన వాటిలో లక్కీ భాస్కర్ స్లో పొయిజాన్ లాగా వంద కోట్లు లాగేయగా హిట్టు కోసం వేచిఉన్న కిరణ్ అబ్బవరంకు క రూపంలో భలే బ్రేక్ దొరికింది. ఈ రెండు ఎగ్జిబిటర్లకు మంచి వసూళ్లతో కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెట్టాయి.
నవంబర్
నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విపరీత ఆలస్యానికి తగ్గట్టే రివర్స్ కొట్టేసింది. భారీ పబ్లిసిటీ చేసుకున్న వరుణ్ తేజ్ మట్కా కనీస షేర్లు తేలేక చతికిలబడటం మెగా ఫ్యాన్స్ ఊహించలేదు. అశోక్ గల్లా డెబ్యూ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన దేవకీనందన వాసుదేవ కనీసం ఊసులో లేనంతగా మాయమైపోయింది. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీకి పబ్లిసిటిలో చేసిన హంగామా తప్ప మిగిలింది సున్నానే. సత్యదేవ్ జీబ్రా పర్వాలేదనిపించుకుంది తప్ప అద్భుతాలు చేయలేదు. రోటి కపడా రొమాన్స్ ని యూత్ సైతం లైట్ తీసుకున్నారు.
డిసెంబర్
ఇది పూర్తిగా పుష్పరాజ్ నెల. పుష్ప 2 ది రూపంలో ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అర్జున్ 1800 కోట్లకు దగ్గరగా వెళ్తూ భవిష్యత్తులో అంత సులభంగా అందుకోలేని రికార్డులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సునామికి ఇరవై రోజుల తర్వాత రిలీజైన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ తట్టుకోలేకపోయిందంటే బన్నీ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బచ్చల మల్లి మీద అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కాంట్రావర్సితో కొంత మార్కెటింగ్ చేసుకున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తేలిపోయింది. డ్రింకర్ సాయి ఎంత ప్రయత్నించినా వీక్ కంటెంట్ తో జనాన్ని రప్పించలేకపోయింది. సో పుష్ప 2తోనే 2024 ముగిసింది.