రీల్ గేమ్ ఛేంజర్ కోసం రియల్ గేమ్ ఛేంజర్!

నిన్న విజయవాడలో రామ్ చరణ్ కటవుట్ లాంచ్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఇచ్చిన హామీ నెరవేరింది. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రాక ఖరారయ్యింది. ఇవాళ ఉపముఖ్యమంత్రిని కలిసిన దిల్ రాజు ఆ మేరకు చర్చించి డేట్ తీసుకున్నారని తెలిసింది. డిసెంబర్ 4 రాజమండ్రిలో ఘనంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లకు పురమాయించినట్టు సమాచారం. రంగస్థలం తర్వాత బాబాయ్ అబ్బాయి మళ్ళీ ఒకే స్టేజి మీద కనిపించే సందర్భం రాలేదు. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మెగా కలయికకు గేమ్ ఛేంజర్ శ్రీకారం చుట్టబోతున్నాడు.

చాలా రకాలుగా ఈ ఈవెంట్ ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోకి వచ్చాక సినిమాలకు సంబంధించిన ఏ పబ్లిక్ ఈవెంట్ కు రాలేదు. బిజీ షెడ్యూల్స్ వల్ల హరిహర వీరమల్లు, ఓజిలకు సైతం ఎక్కువ డేట్లు ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. ఇండస్ట్రీ నుంచి ఏదైనా సమస్య గురించి వస్తే తప్ప నిర్మాతలు దర్శకులను కలవలేదు. ఇప్పుడు చరణ్ కోసం వీలు చేసుకోవడం విశేషం. జనసేన అధినేతగా ఎన్డీయే కూటమిలో పవన్ చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బలంగా వెళ్తున్నాయి. గేమ్ ఛేంజర్ కమర్షియల్ సినిమానే అయినా కాన్సెప్ట్ సమాజానికి సందేశం ఇచ్చేలా ఉంది. సో ఈ అంశం కీలకం కానుంది.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే వేడుకకు వస్తారనే ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ట్రైలర్ కు సంబంధించిన ఇన్ఫో బయటికి ఇవ్వలేదు. జనవరి 1 తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అతిథిగా హైదరాబాద్ లో చేస్తారనే ప్రచారం గురించి దిల్ రాజు టీమ్ ఇంకా స్పందించలేదు. బజ్ పరంగా అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద బ్రేక్ కానుంది. ఇది పూర్తయ్యాక జనవరి 5 నుంచి హిందీ, తమిళ వెర్షన్లకు సంబంధించిన ప్రెస్ మీట్లు, పబ్లిసిటీలో చరణ్ బిజీ కాబోతున్నాడు. పుష్ప 2 తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీ ఇదే.