ఇప్పుడున్న పరిస్థితుల్లో రీమేకులు ఎంత మేకుల్లా మారాయో బాక్సాఫీస్ సాక్షిగా చూస్తూనే ఉన్నాం. తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ అడ్డంగా బోల్తా పడ్డాక ఇప్పుడు అందరి చూపు ఉస్తాద్ భగత్ సింగ్ వైపు వెళ్తోంది. పవన్ కళ్యాణ్ రీమేకులు చేయడం కొత్త కాదు. ఆ మాటకొస్తే అజ్ఞాతవాసి తర్వాత చేసినవన్నీ ఇతర బాషల నుంచి తీసుకొచ్చినవే. అయితే ఇక్కడో ముఖ్య విషయం గమనించాలి. వకీల్ సాబ్ మూలం పింక్ హీరో అమితాబ్ బచ్చన్ కాబట్టి ఇమేజ్ పరంగా పోలిక రాలేదు. భీమ్లా నాయక్ ఒరిజినల్ అయ్యప్పనుం కోశియుమ్ లో ఇద్దరు లీడ్ రోల్స్ టయర్ వన్ స్టార్లు కాదు కనక మళయాలం చూసినవాళ్లు తక్కువగా ఉన్నారు.
బ్రో తమిళ రూపం వినోదయ సితంలో పవన్ పాత్ర చేసింది తంబీ రామయ్య కావడంతో అదేపనిగా ఓటిటిలో చూసిన వాళ్ళు తక్కువ. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్లస్ మార్కెట్ వల్ల గట్టెక్కిపోయాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అలా కాదు. తేరిని విజయ్ హీరోగా చూశాం. తెలుగు డబ్బింగ్ ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. స్టార్ మా ఛానల్ లో పలుమార్లు టెలికాస్ట్ అయ్యింది. సో కథ పరంగా ఎలాంటి ఎగ్జైట్ మెంట్ ఉండదు. కాకపోతే దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తరహాలో ఏమైనా కీలక మార్పులు చేసి ఉంటాడనే దాని మీద అభిమానులు బోలెడంత ఆశలు పెట్టుకున్నారు.
అసలే హరీష్ శంకర్ కి మిస్టర్ బచ్చన్ రూపంలో మొన్న షాక్ కొట్టింది. రైడ్ ని తెలుగీకరించబోయి దబ్బున కింద పడ్డారు. ఇప్పుడు ఉస్తాద్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోక తప్పదు. యధాతథంగా తీస్తే ఇబ్బందులు తప్పేలా లేవు. ఎంత పవన్ సినిమా అయినా మరీ గుడ్డిగా జనాలు థియేటర్లకు పరిగెత్తరుగా. పైగా ఫ్యాన్స్ లో బజ్ పరంగా ఓజి, హరిహర వీరమల్లు తర్వాత చివరి స్థానంలో ఉంది ఉస్తాద్ భగత్ సింగే. ఎలాగూ చేతిలో సమయం ఉంది కాబట్టి ఒకటికి పదిసార్లు వడబోత అవసరం. ఎలాగూ హరీష్ కు ఇది చావో రేవో తేల్చుకునే అవకాశం. సరిగ్గా వాడుకుంటే మాత్రం సూపర్ కంబ్యాక్ అవుతుంది.