పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం ప్రజా జీవితంలో మమేకమై, సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయినా కొందరు అభిమానులకు సినిమా వ్యామోహం ముందు రాజకీయ ఎదుగుదల కనిపించదు. దాని ఫలితమే ఎక్కడైనా పవన్ ప్రజా పర్యటనల్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న జనంలో నుంచి ఓజి అంటూ సినిమాకు సంబంధించిన కేకలు వినిపించడం. ఇది ఎన్నికల సమయంలో అంటే ఓకే. కానీ ఇప్పుడు గెలిచాక జనసేన అధినేత పవన్ కార్యాచరణ ఆలోచన రెండూ మారాయి.
దానికి అనుగుణంగానే ఫ్యాన్స్ నడుచుకోవాలి తప్పించి వేరేలా కాదు. తాజాగా గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబు ను పరమర్శించాక ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు ఓజి అంటూ కొందరు కేకలు వేయడం అసహనం కలిగించిన మాట వాస్తవం. సమయం సందర్భం చూసుకోవాలిగా. ఇప్పుడు ఏకంగా డివివి సంస్థే అభిమానులకు విన్నపం చేసింది. ఓజిని మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం కష్టపడుతున్నామని, సమయం సందర్భం చూడకుండా ఓజి ఓజి అంటూ పొలిటికల్ సభల్లో నినాదాలు చేయడం తగదని హితవు పలికింది. కొంచెం వెయిట్ చేయమని 2025లో వైభవాన్ని చూపిస్తామని హామీ ఇచ్చింది.

ఇకనైనా ఫ్యాన్స్ ప్రాక్టికల్ గా ఆలోచించి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ ఓజి కన్నా ఎక్కువగా ఆయన చేస్తున్న జనహిత కార్యక్రమాలను మరింత చేరువగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి బ్యాంకాక్ షెడ్యూల్ షూట్ అయ్యాక ఇండియాలో కొనసాగుతుంది. హరిహర వీరమల్లు పూర్తి చేశాక పవన్ దీనికి డేట్లు కేటాయించబోతున్నారు. జనవరిలో ఉండొచ్చని సమాచారం. రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఓజి నుంచి ఎలాంటి పోస్టర్, పాట విడుదల ఉండకపోవచ్చని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates