టాలీవుడ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అగ్రదర్శకుడు దాసరి నారాయణరావు.. ఈ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత.. ఈ పోస్టు(అప్రకటితం) కోసం.. మంచు మోహన్ బాబు ప్రయత్నించారు. కానీ, ఫలించలేదు. ఆయనను ఎవరూ టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా చూడలేక పోయారు. దీంతో సమస్యలు వచ్చినప్పుడల్లా.. పెద్దలు ఎవరున్నారా? అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు పుష్ప-2 వ్యవహారం ముదిరి.. రసకందాయానికి చేరుకున్న సందర్భంలోనూ ఇదే పరిస్థితి ఎదు రైంది. అగ్రదర్శకులు.. నిర్మాతలు, సీనియర్ మోస్ట్ నటులు సీ. అశ్వనీదత్, మురళీమోహన్, రాఘవేంద్ర రావు..వంటివారు ఉన్నా.. మనకెందుకులే అనుకున్నారో.. లేక పెద్దలుగా తాము సరిపోమని భావించారో కానీ.. ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా అరంగేట్రం చేసిన దిల్ రాజు
సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు సమస్య వచ్చినప్పుడు కూడా.. ఆయన ఎంట్రీతో కొంత సర్దుమణిగింది. ఆ తర్వాత.. పెద్దగా వివాదాలు రాలేదు. ఇక, ఇప్పుడు మరోసారి పుష్ప-2 వివాదంపై దిల్ రాజు జోక్యం తో ఇప్పటి వరకు నెలకొన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించినట్టు అయింది. రాజు ప్రమేయం తర్వాత.. వేగంగా పరిణామాలు మారాయి. అప్పటి వరకు లక్షల్లోనే ఉన్న పరిహారం కోట్లకు చేరడంతో విమర్శకుల నోటికి తాళం వేయగలిగారు.
అదేసమయంలో ప్రభుత్వ పక్షంలోనూ దిల్ రాజుకు మంచి అభిప్రాయం ఉండడంతో ఆయన జోక్యంపై అటు ప్రభుత్వ పక్షం.. ఇటు టాలీవుడ్ కూడా.. మౌనంగా ఉంది. అంటే.. అర్ధాంగీకారం అయినట్టే. దిల్ రాజు జోక్యంతో సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రధాన చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం.
మొత్తానికి ఈ సమస్య కనుక పరిష్కారం అయితే.. (న్యాయ వివాదాలు కొనసాగుతాయి) ఇప్పటి వరకు టాలీవుడ్‌లో నెలకొన్న పెద్దల
గ్యాప్‌కు రాజు పరిష్కారం చూపినట్టేనని అంటున్నారు పరిశీలకులు.