ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా ఎక్కువగా వయొలెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. మాములుగా ఈ ట్రెండ్ ఓటిటిలో ఉంటుంది కానీ సినిమాల్లో పరిమిత మోతాదు ఉండటం గమనిస్తాం. కానీ ఇప్పుడా లెక్కలు మారిపోయాయి. ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ మూవీ కిల్ లో రైలు పెట్టెలో హీరో చేసే అరాచకం, విలన్లు చేసే మర్డర్లు ఎలా వర్కౌట్ అయ్యాయో కలెక్షన్ల సాక్షిగా ఋజువయ్యింది. ఇప్పుడది ఎందుకు పనికిరాదనే రేంజ్ లో ఒక మలయాళం సినిమా వచ్చింది. దాని పేరు మార్కో. తెలుగులో జనవరి 1 విడుదల చేయబోతున్నారు.
మలయాళం వెర్షన్ కేవలం 5 రోజులకే 50 కోట్లు వసూలు చేసింది. ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ పోషించాడు. మనకు అంతగా పరిచయం లేనట్టు అనిపిస్తాడు కానీ అనుష్క భాగమతిలో ప్రేమికుడిగా నటించింది తనే. అంతకు ముందు జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కొడుకుగా నటించాడు. యశోద, ఖిలాడీలోనూ చూడొచ్చు. ఇంతకీ మార్కో కథేంటంటే మాఫియా సామ్రాజ్యాన్ని శాశించే అన్నదమ్ముల్లో చివరి వాడిని శత్రువులు దారుణంగా చంపేస్తారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడమే మార్కో స్టోరీ. విపరీతమైన హింసను జొప్పించినా కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో దర్శకుడు హనీఫ్ ఆదేని మేజిక్ చేశాడు.
అంతగా ఏముందబ్బా అంటే గర్భిణీ స్త్రీ మీద క్రూరం గా దాడి చెయ్యడం. చిన్న పిల్లాడిని సైతం చాలా దారుణం గా చంపడం వంటి విపరీతమైన వయోలెంట్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇలాంటివి బోలెడు పెట్టేశారు. ఒకదశలో మరీ ఇంత హింస అవసరమా అనిపిస్తుంది. కానీ ఇంటెన్సిటీ బాగా పండటంతో మాస్ ప్రేక్షకులకు మార్కో కనెక్ట్ అయిపోతోంది. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా సరే జనం ఎగబడి చూస్తున్నారు. మరి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇంకో వారం రోజులు ఆగితే తెలుస్తుంది.