గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆప్తులైన వ్యక్తుల్లో తనికెళ్ల భరణి ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం వీరిది. ఎన్నో సినిమాలకు కలిసి పని చేశారు. భరణి దర్శకత్వంలో బాలు ‘మిథునం’ సినిమాలో లీడ్ రోల్ చేసి అద్భుత అభినయం ప్రదర్శించడం, ఆ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకోవడం తెలిసిన సంగతే.
ఐతే ఈ కథను ముందు బాలుకు చెప్పినపుడు.. భరణినే ప్రధాన పాత్ర చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారట. ఐతే కథ రాసి, దర్శకత్వం చేస్తూ తనే అందులో నటిస్తే.. ఇక ఆ సినిమాను తాను మాత్రమే చూసుకోవాల్సి వస్తుందని చమత్కరించాడట భరణి. దీంతో బాలు ఈ పాత్రన ఒప్పుకుని చాలా తక్కువ పారితోషకానికి సినిమా చేశారని భరణి ఆయనకు నివాళి అర్పిస్తూ రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు.
ఇక ‘మిథునం’ చిత్రీకరణ జరిగే సమయంలో తనకు, బాలుకు చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చినట్లు భరణి వెల్లడించారు. ఒక రోజు చిత్రీకరణ బాగా ఆలస్యం అయిందని.. దీంతో అసహనానికి గురైన బాలు కెమెరామన్, సెట్లో ఉన్న వారి మీద అరిచేశారని.. ఐతే ఎక్కడేం తప్పు జరిగినా దర్శకుడిగా బాధ్యత తనదే కాబట్టి తాను చిన్నబుచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని భరణి వెల్లడించారు.
దీంతో తమ మధ్య రెండు రోజులు మాటలు లేకుండా పోయాయని.. ఇంతలో షూటింగ్ పూర్తయి బాలు గారు వీడ్కోలు తీసుకోబోతుంటే అన్యమనస్కంగా కారు దగ్గరికి వచ్చానని.. ఐతే బాలు వెంటనే తనను దగ్గరికి తీసుకుని హత్తుకున్నారని.. తనకు బాగా ఏడుపొచ్చేసిందని, ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోబోతుంటే తనను లేపి ముద్దు పెట్టుకున్నారని.. తాను ‘మిథునం’ సినిమాను అద్భుతంగా తీశానని, తనతో పాటు ఆయనకూ చాలా మంచి పేరొస్తుందని సంబరంగా అన్నారని భరణి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బాలు గారి కోసం ఒక వంట మనిషిని పెట్టి రకరకాల వంటకాలు చేయించామని.. కానీ తాను బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవడం వల్ల రెండు పిడికెళ్ల కంటే ఎక్కువ అన్నం తినలేనంటూ వాపోయారని భరణి వెల్లడించారు.