సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు వారాంతాల్లో సందడి ఉంటుంది. సెలబ్రేషన్ మూడ్‌లో ఉండే జనాలు థియేటర్లకు బాగానే వస్తారు. ఈ టైంలో బాక్సాఫీస్ దగ్గర పోటీ కూడా బాగానే ఉంటుంది. ఈసారి కూడా రిలీజైన సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వాటిలో భారీ అంచనాలున్న సినిమాలేవీ లేవు. తండేల్, రాబిన్ హుడ్ లాంటి క్రేజీ సినిమాలు క్రిస్మస్ రేసు నుంచి తప్పుకోవడంతో ఈ సీజన్ కళ తప్పింది.
రిలీజైన మిగతా సినిమాలేవీ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకోలేకపోయాయి. గత వీకెండ్లో నాలుగు సినిమాలు రిలీజైనా.. ఒక్కటీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. గత వారం రిలీజైన నాలుగు చిత్రాల్లో అల్లరి నరేష్ సినిమా ‘బచ్చలమల్లి’ ఒక్కటే స్ట్రెయిట్ మూవీ. దానిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.
అల్లరి నరేష్ నటన మినహాయిస్తే సినిమాలో స్టాండౌట్‌గా నిలిచే విషయాలు లేవు. సీరియస్ సినిమా కావడం వల్ల ఈ సినిమాకు సరైన వసూళ్లు కూడా రావట్లేదు. ఇక తమిళ అనువాద చిత్రం ‘విడుదల-2’.. విడుదల-1 తరహాలో మెప్పించలేకపోయింది. ఉపేంద్ర సినిమా ‘యుఐ’ ప్రేక్షకుల మెదడుకు చాలా పరీక్షలు పెడుతూ పర్లేదు అనే స్ధాయిలో వసూలు చేస్తుంది. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముఫాసా’లో మహేష్ వాయిస్ ఓవర్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు.
ఈ నాలుగు చిత్రాల్లో ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడలేకపోయింది. ఇంతలో ఈ వారం మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర పోషించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’కు పెద్దగా బజ్ లేదు. డబ్బింగ్ సినిమాలు బరోజ్, మ్యాక్స్‌లకు కూడా హైప్ కనిపించడం లేదు. వీటి టాక్‌ను బట్టి థియేటర్లకు జనం వస్తారేమో చూడాలి. మొత్తంగా చూస్తే క్రిస్మస్ లాంటి క్రేజీ సీజన్ వేస్టయిపోతున్నట్లే కనిపిస్తోంది.