ఒక బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ఆయన పట్టించుకోలేదు. ఐతే ఈ రీమేక్ పరంపరకు గత ఏడాది బ్రేక్ పడింది. స్ట్రెయిట్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీలతో ప్రేక్షకులను పలకరించాడు. వీటిలో తొలి సినిమా నిరాశపరిచినా.. రెండో చిత్రం మంచి ఫలితాన్నందుకుంది.
ఇక పవన్ చేతిలో ఉన్న ఏకైక చిత్రం.. ఉస్తాద్ భగత్ సింగ్. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్ అనే అభిప్రాయంతోనే మొదట్నుంచి అందరూ ఉన్నారు. కానీ ‘ఉస్తాద్..’ రీమేక్ కానే కాదంటూ ఇటీవలే దర్శకుడు హరీష్ శంకర్ నొక్కి వక్కాణించాడు. నా సినిమాలో ఒక ఎపిసోడ్‌ను తమ చిత్రంలో పెట్టుకున్న ‘తెరి’ మూవీని నేనెందుకు రీమేక్ చేస్తా, ‘కథ-మాటలు-దర్శకత్వం’ అని కార్డ్ ఎందుకు వేసుకుంటా అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇది స్ట్రెయిట్ మూవీనేలే అని ఫ్యాన్స్‌లో ఉత్సాహం వచ్చింది.
ఐతే స్వయంగా దర్శకుడే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు కానీ.. బుక్ మై షో వాళ్లు మాత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకే అని సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి సినిమాకు బుక్ మై షోలో సినాప్సిస్ ఇవ్వడం కామనే. చాలావరకు అది చిత్ర బృందం నుంచి తీసుకున్న సమాచారమే ఉంటుంది.
ఐతే ‘ఉస్తాద్..’ కథా సారాంశం గురించి చెబుతూ.. ఒక ఐపీఎస్ అధికారి తన కూతురితో కలిసి అజ్ఞాతావాసంలో ఉంటాడని.. అంతకుముందు అతడి కుటుంబాన్ని కొందరు నాశనం చేస్తారని.. ఒక సందర్భంలో తన ఐడెంటిటీ బయటపడిపోవడంతో మళ్లీ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ అధికారి ఏం చేశాడన్నది ఈ కథ అని అందులో పేర్కొన్నారు.
ఈ సినాప్సిస్ ‘తెరి’దే అని ఆ సినిమా చూసిన వాళ్లందరికీ అర్థమైపోతుంది. దీంతో హరీష్ ఒకవైపు రీమేక్ కాదు మొర్రో అంటుంటే.. బీఎంఎస్ వాళ్లు మాత్రం ఇది ‘తెరి’ రీమేక్ అన్నట్లుగా సినాప్సిస్ ఇవ్వడమేంటి అని పవన్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరిగింది.
ఐతే విషయం ‘ఉస్తాద్’ టీంకు తెలిసి బీఎంఎస్ వాళ్లతో మాట్లాడారో ఏమో.. ఈ రోజు సినాప్సిస్ మార్చేశారు. తనకు ‘భగత్ సింగ్’ అని పేరు పెట్టిన ఒక టీచర్ స్ఫూర్తితో అన్యాయంపై పోరాడిన ఒక పోలలీస్ అధికారి కథ అంటూ అప్‌డేట్ చేసింది బీఎంఎస్. దీంతో ‘ఉస్తాద్’ రీమేక్ ప్రచారానికి పూర్తిగా తెరపడినట్లయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates