మార్చి నెలలో వస్తాయనుకున్న కొన్ని క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడిపోయాయి. చివరి వారానికి షెడ్యూల్ అయిన ది ప్యారడైజ్, పెద్ది కొత్త డేట్లు చూసుకున్నాయి. ‘డెకాయిట్’ సైతం రేసు నుంచి తప్పుకుంది. ఇటీవలే ‘టాక్సిక్’ లాంటి పెద్ద సినిమా సైతం వెనక్కి వెళ్లిపోయింది.
దీంతో పాన్ ఇండియా ప్రేక్షకుల ఆశలన్నీ ‘దురంధర్-2’ మీదే నిలిచాయి. ఐతే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందేమో అని తాజాగా జనాలకు భయం పట్టుకుంది. రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్లు లేకపోవడం.. ట్రైలర్ లాంచ్ చేయకపోవడమే ఇందుక్కారణం.
నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ‘దురంధర్-2’ వాయిదా గురించి జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ట్రైలర్ ఎక్కడ.. ప్రమోషన్లు ఏవీ అంటూ టీంను వాయించేస్తున్నారు సినీ అభిమానులు. ఆదిత్య ధర్ అండ్ టీం మౌనంగా ఉండిపోవడంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. సినిమా వాయిదానే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్న సమయంలో టీం స్పందించింది.
‘దురంధర్-2’ ట్రైలర్‌ను శనివారం లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అంతే కాక మార్చి 19నే ఈ చిత్రం విడుదలవుతుందని కూడా స్పష్టం చేశారు. ఈసారి కేవలం హిందీ వరకే కాకుండా తెలుగు, తమిళం సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
‘దురంధర్: ది రివెంజ్’ పేరుతో రానున్నఈ సినిమాకు ట్రైలర్‌ను కూడా బహు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. గత డిసెంబరు 5న పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘దురంధర్’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపింది.
రెండు నెలల థియేట్రికల్ రన్‌తో ఏకంగా రూ.1300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ‘దురంధర్-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఫస్ట్ పార్ట్ లాగే ఉంటే ఇది రూ.2 వేల కోట్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. హంజా అనే స్పై పాత్రలో రణ్వీర్ సింగ్ ఈసారి ఇంకెన్ని విన్యాసాలు చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు దేశ విదేశాల్లో 19న రికార్డు రిలీజ్ దక్కబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates