కొందరు సినీ ప్రముఖులు మాట్లాడుతుంటే అందరూ అలెర్ట్ అవుతారు. వాళ్ల మాటతీరు భయం గొల్పేలా ఉంటుంది. ఎప్పుడూ ఫైర్ మీద ఉన్నట్లుగా కనిపించే ఆ వ్యక్తులు.. ఎప్పుడు ఏం చేస్తారో అన్నట్లుగా కంగారు పుట్టిస్తుంటారు. ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి… కబీర్ సింగ్, యానిమల్ మూవీస్‌లో బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు రేపిన సందీప్ రెడ్డి వంగ ఈ కోవకే చెందుతాడు.
ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూల్లో, స్టేజ్ మీద మాట్లాడేటపుడు సందీప్ చాలా సీరియస్‌గా కనిపిస్తుంటాడు. తనకు ఎవరైనా బ్రేక్ వేయాలని చూస్తే గట్టి పంచ్ వేయడానికి వెనుకాడడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగను గుర్తు చేసేలా ఒక యువ నటుడు మాట్లాడ్డం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ నటుడి పేరు.. స్పర్శ్ శ్రీవాస్తవ. ఇంతను బాలీవుడ్ క్లాసిక్ ‘లాపతా లేడీస్’తో నటుడిగా చాలా మంచి పేరు సంపాదించాడు. అందులో అమాయకమైన పల్లెటూరి భర్త పాత్రలో స్పర్శ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
ఈ టాలెంటెడ్ యాక్టర్.. త్వరలోనే టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ‘వృష కర్మ’లో స్పర్శ్ విలన్ పాత్ర చేశాడు. నిన్న రిలీజ్ చేసిన టీజర్లో అతనే హైలైట్ అయ్యాడు. టీజర్లోనే జనాలను భయపెట్టేశాడు స్పర్శ్.
ఐతే తెర మీదే కాదు.. బయట కూడా అతను జనాలను కాస్త కంగారు పెట్టేలాగే మాట్లాడాడు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో అతను చాలా సీరియస్ స్పీచ్ ఇచ్చాడు. ఐతే స్పర్శ్ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నానంటూ ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. ఆడిటోరియంలో ఉన్న లేడీ జర్నలిస్ట్ గట్టిగా ఇంగ్లీష్ వద్దు అని చెప్పడంతో తను హిందీలో మాట్లాడడం మొదలు పెట్టాడు.. మళ్ళీ వెంటనే ఆవిడ అడ్డుచెప్పడంతో… నేను హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. మీరు అడ్డుతగులుతున్నారంటూ.. వచ్చి మీరే మాట్లాడుకోండి అనేశాడు స్పర్శ్.
దీంతో అక్కడ వాతావరణం కొంచెం వేడెక్కింది. స్పర్శ్ హావభావాలు, మాటతీరు చూస్తే అక్కడ ఉన్న వాళ్లకు సందీప్ రెడ్డి వంగనే గుర్తుకొచ్చాడు. బాలీవుడ్లోనూ ఒక వంగ ఉన్నాడంటూ.. యానిమల్ బీజీఎం వేసి కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates