తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి చిత్రం ‘జెంటిల్‌మ్యాన్’ నుంచి ఎన్నో సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. శంకర్ ప్రైమ్ ఫాంలో ఉన్నపుడు ఆయనతో సినిమా చేయాలని చాలామంది టాలీవుడ్ స్టార్లు ప్రయత్నించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘రోబో’ ఆడియో వేడుకలో వెల్లడించారు. కానీ అది సాధ్యపడలేదు.
ఐతే చిరుకు కుదరకపోయినా ఆయన తనయుడు రామ్ చరణ్.. శంకర్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు. వీరి కలయికలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. మధ్యలో శంకర్ నుంచి వచ్చిన ‘ఇండియన్-2’ డిజాస్టర్ కావడం కూడా దీని మీద ప్రతికూల ప్రభావం చూపింది. అయినా ‘గేమ్ చేంజర్’ అన్ని అడ్డంకులనూ అధిగమించి బ్లాక్ బస్టర్ అవుతుందని టీం నమ్ముతోంది.
ఈ సినిమాకు సంబంధించి యుఎస్‌లో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో శంకర్ సైతం పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన తెలుగు ఎంట్రీ ఇంత ఆలస్యం కావడం గురించి మాట్లాడారు. తెలుగు హీరోలతో సినిమా చేయాలని చాలా ముందు నుంచే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ముందుగా చిరంజీవితో సినిమా కోసం గతంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదన్నారు. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం ట్రై చేశానన్నారు. అదీ వర్కవుట్ కాలేదని.. ఇక కరోనా టైంలో ప్రభాస్‌తో సినిమా కోసం సీరియస్‌గా ప్రయత్నం జరిగిందని శంకర్ వెల్లడించారు.
తమ మధ్య కథా చర్చలు కూడా జరిగాయన్నారు. చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉందని, అలా ‘గేమ్ చేంజర్’ కార్యరూపం దాల్చిందని శంకర్ వ్యాఖ్యానించారు. తెలుగులో తాను సినిమా చేస్తే ఒక్కడు, పోకిరి తరహాలో చేయాలనుకున్నానని.. అందులో తన మార్కు ఉండాలనుకున్నానని.. అలా వచ్చిందే తడవుగా‘గేమ్ చేంజర్’ అని.. ఇందులో చరణ్ చాలా సటిల్‌గా, అద్భుతంగా నటించాడని శంకర్ తెలిపాడు.