మహేష్‍ చేజారిపోతాడని టెన్షన్‍!

పెద్ద సినిమాల వరకు సూపర్‍స్టార్‍ స్టేటస్‍ వున్న హీరోనే కెప్టెన్‍. రాజమౌళి మినహా మరెవరికీ హీరోని ధిక్కరించడం కానీ, శాసించడం కానీ కుదరదు. బడా స్టార్‍ ఏమనుకుంటే అదే జరుగుతుంది. నిర్మాత అయినా, దర్శకుడు అయినా అతనేం చెబితే అది చేయాల్సిందే. ‘సర్కారు వారి పాట’ సినిమా చేయడానికి అంగీకరించిన మహేష్‍కి ఈలోగా త్రివిక్రమ్‍తో సినిమా చేసే ఛాన్సుందనిపించింది.

ఎన్టీఆర్‍తో సినిమా ఖాయం చేసుకున్న త్రివిక్రమ్‍కి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆ సినిమా లేట్‍ అయ్యేట్టయితే మహేష్‍తో సినిమా చేసేద్దామనే ఐడియాతో త్రివిక్రమ్‍ వున్నాడు. ఈ సంకేతాలు అందడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్‍ త్వరగా మొదలు పెట్టేయడానికి మైత్రి మూవీస్‍ సన్నాహాలు చేసుకున్నారు.

నవంబరులో అమెరికాలో ఒక షెడ్యూల్‍ చేద్దామని ప్లాన్‍ చేసారు. అక్కడకి లొకేషన్‍ రెక్కీ కోసం వెళ్లిన పరశురాం ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో షూటింగ్‍ అంత ఈజీ కాదని తెలుసుకున్నాడు. దీంతో షూటింగ్‍ జనవరికి వాయిదా పడింది. ఈలోగా మహేష్‍ కానీ త్రివిక్రమ్‍ సినిమా మొదలు పెట్టేస్తాడేమోననే భయం, కంగారు ‘సర్కారు’ యూనిట్లో నెలకొంది. వారి భయాన్ని మరింత పెంచుతూ త్రివిక్రమ్‍తో అతి త్వరలో సినిమా చేస్తున్నట్టు మహేష్‍ ట్వీట్‍ కూడా పెట్టేసాడు.