విడుదల పార్ట్ 3 క్లారిటీ ఇచ్చేశారు!

విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం ఇష్టపడిన వాళ్ళు సీక్వెల్ మీద రెట్టింపు ఆసక్తితో ఎదురు చూశారు. మాములుగా తమిళంలో సెకండ్ పార్టులు వర్కౌట్ అయిన దాఖలాలు తక్కువ. అందుకే ఇది సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా లేదానే అనుమానాలు తలెత్తాయి. ఎడిటింగ్ కు ముందు మొత్తం నాలుగున్నర గంటలకు పైగా ఫైనల్ కట్ వచ్చిందనే ప్రచారం చెన్నై వర్గాల్లో తిరిగింది. అంటే విడుదల పార్ట్ 3 ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే సినిమా చూశాక పూర్తి క్లారిటీ వచ్చేసింది.

వెట్రిమారన్ విడుదల కథని ముగించేశారు. విజయ్ సేతుపతి పోషించిన పెరుమాళ్ పాత్ర గత జీవితంతో పాటు అతను నక్సలైట్ గా మారేందుకు ప్రేరేపించిన పరిస్థితులు చూపించిన వెట్రిమారన్ క్లైమాక్స్ ని అధిక శాతం ప్రేక్షకులు ఊహించినట్టే ముగింపు ఇచ్చేసి కొనసాగంపు లేదనే సంకేతం ఇచ్చేసాడు. విడుదల పార్ట్ 1లో సినిమా మొత్తం కనిపించే సూరి ఇందులో చాలా పరిమిత స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నాడు. ఉండాలంటే ఉండాలనే తరహాలో మూడు నాలుగు సీన్లు, అయిదారు డైలాగులు పెట్టారు. ఒక ముఖ్యమైన సన్నివేశం పడింది కానీ ఓవరాల్ గా చూపించిన ప్రభావం తక్కువే.

తమిళనాడులో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న విడుదల పార్ట్ 2 తెలుగులో ఏ మేరకు మెప్పిస్తుందో చెప్పడం కష్టమే. సీరియస్ టోన్ లో సాగుతూ పార్ట్ 1 ఉన్నంత గ్రిప్పింగ్ గా అనిపించకపోవడం కొంత ప్రభావం చూపించవచ్చు. పైగా ఇళయరాజా సంగీతం సైతం ఏమంత కిక్ ఇవ్వలేదు. పావురమా పాట మినహాయించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఆయన ముద్ర అంతగా వినిపించలేదు. టెక్నికల్ గా మాత్రం మెచ్చుకునేలా సాగింది. మంజు వారియర్ పర్వాలేదనిపించింది. అన్ని వర్గాల ఆదరణ దక్కడం అనుమానంగానే ఉంది. లేదూ స్లో పాయిజన్ లా రోజులు గడిచేకొద్దీ జనాలకు కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.