మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని గేమ్ ఛేంజర్ ప్రమోషన్ల కోసం బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత చేస్తున్న సినిమానే అయినా బుచ్చిబాబు దీని మీద విపరీతమైన అంచనాలు పెంచడంలో సక్సెసయ్యాడు. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. వీటి కన్నా ముందు ఏఆర్ రెహమాన్ ని ఒప్పించడమే కాక తక్కువ టైంలో మూడు పాటలు కంపోజ్ చేయించుకుని వావ్ అనిపించుకున్నాడు. వచ్చే నెల నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆయన సెట్లో అడుగు పెట్టలేదు. నిన్నే ఒక ముఖ్యమైన సర్జరీ కోసం అమెరికా బయలుదేరారు. మియామి ఫ్లోరిడాలో ఈ నెల 24న ఆపరేషన్ జరగనుంది. 62 ఏళ్ళ వయసున్న ఈ సీనియర్ స్టార్ ఆరోగ్యం పట్ల శాండల్ వుడ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తనకు ఎలాంటి తీవ్రమైన సమస్య లేదని, అనవసరంగా లేనిపోని ప్రచారాలు చేసి ఫ్యాన్స్ ని ఖంగారు పెట్టొద్దని కోరారు. యుఎస్ కు వెళ్లబోయే ముందు కన్నడ రంగానికి సంబంధించిన పలువురు స్టార్లు, డైరెక్టర్లు శివన్నకు సెండాఫ్ ఇచ్చారు.
కొద్దివారాలు విశ్రాంతి తర్వాత శివరాజ్ కుమార్ తిరిగి రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమై ఉన్నారు. రామ్ చరణ్ 16 కాకుండా 45 టైటిల్ తో రూపొందుతున్న చిత్రంతో పాటు సప్తసాగరాలు సైడ్ ఏబి దర్శకుడు హేమంత్ రావు తీస్తున్న భైరవన్ కొనే పత ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. తన వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో భైరతి రణగల్ తర్వాత శివన్న ఎవరికీ జనవరి దాకా డేట్లు ఇవ్వలేదు. పూర్తిగా కోలుకుని వచ్చేసరికి ఫిబ్రవరి అయ్యేలా ఉంది. సో రామ్ చరణ్ బృందానికి షెడ్యూల్ పరంగా కొన్ని మార్పులు చేసుకోక తప్పేలా లేదు. శివరాజ్ కుమార్ చేయబోయేది చాలా ప్రాముఖ్యమున్నా క్యారెక్టర్.