డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కుటుంబంలో తెరమీదికి వచ్చిన ఆస్తుల వివాదం.. అనేక మలుపులు తిరుతు న్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఈ వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపైనా దాడులు జరిగాయి. తాజాగా మంచు విష్ణుకు మద్దతుగా మోహన్‌బాబు సతీమణి నిర్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం తప్పంతా మనోజ్‌దేనని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. దీనినే పోలీసులకు కూడా పంపించారు.
శనివారం మంచు విష్ణు.. తన సోదరుడు మనోజ్ ఇంట్లో ఘర్షణకు దిగాడని, హత్యాయత్నానికి పాల్పడ్డాడని చేసిన వ్యాఖ్యలను నిర్మల ఖండించారు. తన పుట్టిన రోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకువచ్చి సంబరాలు చేశాడని.. కానీ, ఏదో జరిగిపోయిందన్నట్టుగా విష్ణుపై అభాండాలు వేసి.. మనోజ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. విష్ణు ఏమీ గొడవ పడలేదని.. తన బట్టలు తీసుకుని వెళ్లిపోయాడని నిర్మల వాంగ్మూలంలో తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా జల్‌పల్లిలోని ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసలు విష్ణుకు గొడవ పడే స్వభావం కూడా లేదని.. ఎవరినీ పన్నెత్తు మాట అనే రకం కూడా కాదన్నారు. కానీ, లేనిపోని విషయాలతో మనోజ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. ఇంట్లో పనిమనుషులతోనూ విష్ణు గొడవ పడ్డాడన్న మనోజ్ వ్యాఖ్యలను కూడా నిర్మల విభేదించారు. అలాంటిదేమీలేద న్నారు. పనిమనుషులే వారికి వారు పని మానేశారని తెలిపారు.
ఇక్కడ పనిచేయలేమంటూ.. మనోజ్ వైఖరి నచ్చకే పనిమనుషులు మానేసినట్టు నిర్మల చెప్పుకొచ్చారు. ఇక, జల్ పల్లి నివాసానికి సంబంధించిన హక్కులపై కూడా నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఈ నివాసంపై మనోజ్‌కుఎంత హక్కు ఉందో.. విష్ణుకు కూడా అంతే హక్కు ఉందన్నారు. ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖను పంపించారు. ఇప్పుడు నిర్మల స్టేట్‌మెంటు ఈ కేసులో కీలకం కాదని అంటున్నారు పరిశీలకులు.