నిన్న మధ్యాన్నం నుంచి అందరూ అల్లు అర్జున్ అరెస్ట్ మీదే దృష్టి పెట్టడంతో థియేటర్లలో మిస్ యు అనే కొత్త సినిమా ఒకటి రిలీజయ్యిందనే సంగతి చాలా మందికి కనీసం గుర్తుకూడా రాలేదు. పుష్ప 2 ఈవెంట్ కొచ్చిన జనాల మీద జెసిబి కామెంట్ చేసిన సిద్దార్థ్ తర్వాత దాన్ని కవర్ చేశాడు కానీ ఈ మూవీ మీద మాత్రం బోలెడంత నమ్మకం పెట్టుకుంటూ వచ్చాడు. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన మిస్ యుకు కనీస స్పందన కరువయ్యింది. ఇంటర్వ్యూలలో సిద్దు బిల్డప్ ఇచ్చిన దాంట్లో కంటెంట్ సగం కూడా మెప్పించేలా లేకపోవడంతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరడం ఖాయమైపోయింది.
ట్విస్ట్ ఏంటంటే స్టోరీ లైన్ కొంచెం హాయ్ నాన్నకు దగ్గరగా ఉంటుంది. కాకపోతే నాని సినిమాలో లాగా మిస్ యులో చైల్డ్ సెంటిమెంట్ లేదు. దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు యాక్సిడెంట్ వల్ల రెండేళ్ల గతాన్ని మర్చిపోతాడు. దీంతో బెంగళూరు వెళ్లి అక్కడ కేఫ్ లో ఉద్యోగం చేస్తుండగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మాత్రం తిరస్కరిస్తుంది. ఇంట్లో వాళ్ళు సైతం ఒప్పుకోరు. దాని వెనుకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేంటో తెలియాలంటే మిస్ యుని మిస్ కాకుండా చూడాలి. లైన్ పరంగా కొత్తగా లేకపోయినా ట్రీట్ మెంట్ బాగుంటే ఇలాంటి సినిమాలు ఆడతాయి.
దర్శకుడు ఎన్ రాజశేఖర్ రాసుకున్న స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్లు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో రెండు గంటల ఆరు నిమిషాల నిడివి సుదీర్ఘంగా అనిపిస్తుంది. సిద్దు, ఆశికా కలుసుకునేదాకా కథ నత్తనడక సాగుతుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్లు బాగానే వచ్చినప్పటికీ మిగిలిన బలహీనతలను కాపాడేందుకు అవి ఎంత మాత్రం సరిపోలేదు. జిబ్రాన్ పాటలు సహనానికి పరీక్ష పెడతాయి. బీజీఎమ్ కూడా అంతంతమాత్రమే. స్టేజి మీద వైరల్ స్పీచులు ఇవ్వడంలో ఆరితేరిపోయిన సిద్దార్థ్ సరైన స్క్రిప్టులు ఎంచుకోవడంలో తన మార్కుని మిస్ చేస్తున్నాడు. అందుకే కలెక్షన్లు మిస్సవుతున్నాయి.