వచ్చే వారం పుష్ప-2 వస్తోంది కదా, దాని ధాటిని ‘మిస్ యు’ సినిమా తట్టుకోగలరా అని రెండు వారాల కిందట అంటే.. కంగారు పడితే వాళ్లే పడాలి, కంటెంట్ ఉన్న సినిమా మాకేం ప్రాబ్లెం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు తమిళ హీరో సిద్ధార్థ్. తీరా చూస్తే ‘పుష్ప-2’కు భయపడి తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. ఇక డిసెంబరు 13కు కొత్త రిలీజ్ డేట్ ఖాయం చేసుకుని ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న సందర్భంలో.. పుష్ప-2 పట్నా ఈవెంట్ గురించి అడిగితే, జేసీబీ పనిచేస్తున్నా జనం వచ్చి చూస్తారంటూ వెటకారంగా మాట్లాడాడు.
ఓవైపు వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు చేస్తూ.. సిద్ధుకు ఇంత యాటిట్యూడ్ ఏంటా అని జనం ఆశ్చర్యపోతున్నారు. తన ప్రతి సినిమా గురించి అతను గొప్పగా మాట్లాడతాడు. తీరా చూస్తే అది అంతంతమాత్రంగా ఆడుతుంది. ‘ఇండియన్-2’ రిలీజ్ ముంగిట అతను ఎంత ఓవరాక్షన్ చేశాడో అందరికీ తెలుసు. ఆ సినిమా ఫలితమేంటో కూడా తెలిసిందే. ‘మిస్ యు’ సినిమా విషయానికి వస్తే.. దీని గురించి కూడా సిద్ధు గొప్పగా చెబుతున్నాడు. కానీ ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల కనీస ఆసక్తి కూడా కనిపించడం లేదు.
ఈ రోజు ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి కూడా సినీ ప్రియులకు తెలియని పరిస్థితి. పుష్ప-2 హ్యాంగోవర్ నుంచి జనం ఇంకా బయటికి రాకపోవడం వల్లో ఏమో.. ‘మిస్ యు’ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చిత్రానికి మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ తెలుగులో ఒక్కో థియేటర్లో పట్టుమని పది టికెట్లు తెగడం కూడా కష్టంగా ఉంది. ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడవని స్క్రీన్లు చాలానే కనిపిస్తున్నాయి.
మార్నింగ్ షోలకు వాకిన్స్ కూడా లేకపోతే.. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ‘నా సామి రంగ’ భామ ఆషికా రంగనాథ్ కోసం కూడా యూత్ ఆసక్తి చూపించట్లేదంటే సిద్ధు మీద ఎంత నమ్మకం కోల్పోయారో, అతడి మీద ఎంత నెగెటివిటీ వచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప-2 ఇంకా జోరు చూపిస్తున్న నేపథ్యంలో సినిమాకు సూపర్ టాక్ వస్తే తప్ప దీన్ని మన ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే.