ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనపై నమోదైన కేసును రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఘటనకు సంబంధించి భద్రతా లోపాల కారణంగా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతా చర్యలు సరిగా చేపట్టలేదని ఆరోపణలు రావడంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోనూ చర్చనీయాంశమైంది.
అయితే తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ చేపట్టనుంది. ఇక ఈ కేసు పరిశీలన ఫలితంపై అల్లు అర్జున్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు సంధ్య థియేటర్ యజమాని కూడా హైకోర్టుని ఆశ్రయించారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదని అతను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.