టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మనోజ్ చొక్కాను బౌన్సర్లు చింపివేయడం, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం వంటి ఘటనలు సంచలనం రేపాయి. ఆ తర్వాత మోహన్ బాబు, ఆయన సతీమణి ఆసుపత్రిలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు.
మీడియాపై దాడి చేసినందుకు తన తండ్రి మోహన్ బాబు తరఫున మీడియాకు మనోజ్ క్షమాపణలు చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మనోజన తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నపుడు ఎన్నో బాధలు అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి గతంలో అలా ఉండేవారు కాదని అన్నారు. తన తండ్రి తనకు దేవుడు అని, అయితే, ఈరోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదని షాకింగ్ కామెంట్లు చేశారు.
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ఎవరినీ ఆస్తులు అడగలేదని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి నాన్నగారికి లేనిపోనివి చెప్పారని, ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నాన్నతో తనకు విభేదాలు సృష్టించారని వాపోయారు. ఈ గొడవలోకి తన భార్య, 7 నెలల కూతురి పేరును లాగుతున్నారని అన్నారు. తన సొంత కాళ్ల మీద నిలబడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందని, క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతానని మనోజ్ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates