యావరేజ్ టాక్‌తో మొదలై, తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ‘పుష్ప: ది రూజ్’ సినిమా.. అంతిమంగా హిట్ స్టేటస్ అందుకుందంటే అందుక్కారణం.. హిందీలో ఈ చిత్రానికి దక్కిన అసాధారణ ఆదరణే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా నార్త్ ఇండియాలో మంచి వసూళ్లు సాధిస్తూ సూపర్ హిట్ రేంజ్ ని అందుకుంది. దీంతో ఓవరాల్‌గా పుష్ప సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ‘పుష్ప-2’కు తిరుగులేని హైప్, అసాధారణ స్థాయిలో బిజినెస్ జరిగింది అంటే హిందీ ఆడియన్స్ పుణ్యమే.
‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో హైప్ మధ్య రిలీజైన ఈ సినిమాకు దక్షిణాదిన కొంత మిక్స్డ్ టాక్, రివ్యూలు వచ్చాయి కానీ.. హిందీలో చాలా వరకు ఫుల్ పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళ్తోంది. నార్త్ ఇండియా అనే కాదు.. విదేశాల్లో కూడా ‘పుష్ప-2’ భారీ వసూళ్లతో దూసుకెళ్తుండడం విశేషం.తొలి రోజే రూ.67 కోట్ల నెట్ వసూళ్లతో ఇండియాలో అత్యధిక డే-1 కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పిన ‘పుష్ప-2’.. ఆ తర్వాత కూడా అదే ఊపుతో కొనసాగుతోంది.
2, 3 రోజుల్లో కూడా వసూళ్లు 50 కోట్లకు పైగానే వచ్చాయి. యుఎస్‌లో సైతం ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ వసూళ్ల మోత మోగిస్తోంది. తెలుగు వెర్షన్‌తో సమానంగా వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచిన పుష్ప-2.. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లో బాగా డ్రాప్ చూసింది. మూడో రోజు పుంజుకుంది. కానీ హిందీ వెర్షన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రెండో రోజు కూడా హౌస్ ఫుల్స్‌తో సాగింది.
ముంబయిలో తొలి రోజే కాక తర్వాత కూడా అర్లీ మార్నింగ్, మిడ్ నైట్ షోలు ఫుల్స్‌తో నడవడం విశేషం. శనివారం రోజు ఎక్కడో నార్త్ ఈస్ట్‌లోని ఈటానగర్‌లో ‘పుష్ప-2’ షోలు ఓపెన్ చేసి చూస్తే అడ్వాన్స్ ఫుల్స్ పడిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లోని చిన్న టౌన్లలో సైతం పుష్ప-2ను ఎగబడి చూస్తున్నారు. ఇక యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఓ తెలుగు డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం.