నెట్ ఫ్లిక్స్ పాలిట బంగారం లా మారిన టాలీవుడ్ సినిమాలు!

అంతర్జాతీయ స్థాయిలో అతి పెద్ద మార్కెట్ ఉన్న ఓటిటిగా నెట్ ఫ్లిక్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఒక రెండేళ్ల క్రితం చూస్తే ఇండియాలో దీనికున్న సబ్స్క్రైబర్స్ తక్కువ. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటివి దూసుకుపోతున్న టైంలో అధిక శాతం ఇంటర్నేషనల్ కంటెంట్ మాత్రమే దొరికే నెట్ ఫ్లిక్స్ ని అధిక ధర చెల్లించి చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు. క్షేత్ర స్తాయిలో ఏం జరుగుతోందో గుర్తించిన సదరు సంస్థ ప్రతినిధులు జనాన్ని ఆకట్టుకోవాలంటే క్రేజీ సినిమాలే బలమైన ఆయుధమని అందులోనూ తెలుగు, తమిళ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గుర్తించి ప్లాన్ మార్చుకుంది.

కట్ చేస్తే 2023 నుంచి నెట్ ఫ్లిక్స్ దూకుడు మాములుగా లేదు. ముఖ్యంగా ఈ ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలోనే వచ్చి చేరాయి. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మాములుగా దుమ్ము దులపలేదు. వ్యూస్ పరంగా రెండు వారాలకు పైగా టాప్ త్రీ ట్రెండింగ్ లో ఉంది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కొస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. కేవలం నాలుగు వారాల థియేట్రికల్ విండోని పెట్టుకోవడం వల్ల భారీ ప్రయోజనం దక్కుతోంది. అంతకు ముందు టిల్లు స్క్వేర్, గుంటూరు కారం లాంటివి నెట్ ఫ్లిక్స్ కి సిరులు కురిపించాయి. లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2 ది రూల్’ దీని ఖాతాలోనే ఉంది. భారీ మొత్తానికి హక్కులు కొన్నారు.

న్యాచురల్ స్టార్ ‘నాని సరిపోదా’ శనివారం సైతం మల్టీలాంగ్వేజెస్ లో నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ని అమాంతం పెంచేసింది. స్టార్లు లేని ‘మత్తువదలరా 2’ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కావడం ఈ ఓటిటికు చేసిన మేలు అంతా ఇంతా కాదు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, రవితేజ మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా స్మార్ట్ స్క్రీన్ పై ఆదరణ దక్కించుకున్నాయి. కంగువ లాంటి డిజాస్టర్లు కాంపిటీటర్లకు వెళ్ళిపోతే నెట్ ఫ్లిక్స్ మాత్రం వరస జాక్ పాట్లు కొడుతోంది. వీటి మీద పెట్టిన వందల కోట్ల పెట్టుబడికి తగ్గట్టుగానే ఫలితాలు ఉండటంతో ఇకపై మరింత దూకుడు చూపించనుంది.