నిన్న రాత్రి పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షోలు ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఒక రాద్ధాంతం కనిపించింది. బన్నీ ఇంట్రడక్షన్ సీన్ లో విలన్ ని ఉద్దేశించి ఒక డైలాగు చెబుతూ నేనేరా బాస్, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి అందరికీ నేనే బాస్ అని అన్నట్టు కొందరు ట్వీట్లు వేయడంతో సినిమా చూడని ఇతర అభిమానులు నిజమే అనుకున్నారు. అసలే కొన్ని నెలలుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ ఆన్ లైన్ లో జోరుగా ఉంది. ఇలాంటి సున్నితమైన పరిస్థితిలో ఇలాంటి ప్రచారం జరగడం మరింత డ్యామేజ్ చేస్తుంది. కానీ దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయి. అవి తెలుసుకోవాలి.
పుష్పరాజ్ పాత్ర పరిచయంలో వచ్చే జపాన్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ బాస్ పదం ఉపయోగించి సంభాషణలు చెప్పిన మాట నిజమే కానీ ట్విట్టర్ లో చెబుతున్నట్టు మాత్రం కాదు. ఎర్రచందనం మాఫియా చేసే ఒక ముఠా నాయకుడిని తలకిందులుగా వేలాడదీసి పుష్ప అనే మాట ” మాములుగా సూస్తే నీ బాస్ హిరోషి కనిపిస్తాడు, ఇలా తలకిందులుగా వేలాడదీసి సూస్తే నీ బాసులకే బాస్ కనిపిస్తాడు, భూగోళంలో యాడున్నా సరే నీ యవ్వ తగ్గేదేలే, నేనేరా నీ బాస్, పుష్ప ఈజ్ ది బాస్” అంటూ తెలుగుతో పాటు జపాన్ భాషను కలగలుపుతూ అంటాడు. దీనికి కొన్ని సబ్ టైటిల్స్ కూడా జోడించారు.
ఇంత స్పష్టంగా సుకుమార్ సీన్ రాస్తే దానికి నానార్ధాలు తీయడం విచిత్రం. లోలోపల ఏమున్నా బహిరంగంగా సినిమాల ద్వారా ఒకరినొకరు కించపరుచుకునే పనులు టాలీవుడ్ హీరోలు చేయరు. ఊరికే నానార్ధాలు తీసి పబ్బం గడుపుకోవాలని కొన్ని ట్విట్టర్ గ్రూపులు చేసిన ప్రయత్నమే తప్ప ఇంకేదీ కాదు. టికెట్లు దొరక్క చాలా మంది థియేటర్లకు వెళ్లే సిచువేషన్ లో లేకపోవడంతో ఎక్స్, ఇన్స్ టాలో వచ్చే మీమ్స్ ని నమ్ముతున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే క్షణాల్లో ఇవి వైరల్ అవుతున్నాయి. అనంతపురం పరిటాల ఘటనకు సంబంధించి రిఫరెన్స్ కూడా ఇందులో వాడారన్న టాక్ కూడా పచ్చి అబద్దం.