పుష్ప 2 కి షాక్ : బెంగళూరు లో బెనిఫిట్ షోలు రద్దు!

ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన ‘పుష్ప 2: ది రూల్’ సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి. ప్రభుత్వ అనుమతి లేకపోయినా అర్ధరాత్రి, తెల్లవారుఝామున షోలు వేసి 500 నుంచి 1500 రూపాయల దాకా ప్రతి టికెట్ మీద వసూలు చేయడం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే గవర్నమెంట్ వైపు నుంచి చర్యలు మొదలయ్యాయి. నిజానికి కర్ణాటకలో ఉదయం 6 గంటల కన్నా ముందు షోలు వేయకూడదు. కానీ పుష్ప 2కి దీన్ని అతిక్రమించానేది ఇతర శాండల్ వుడ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదు.

దీనికి స్పందించిన బెంగళూరు కలెక్టర్ తాజాగా ప్రీమియర్ షోలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక సినిమా రెగ్యులేషన్ నిబంధన 41ని అనుసరించి లైసెన్స్ పొందిన ఏ ఎగ్జిబిటరైనా ఉదయం 6.30 కన్నా ముందు షోలు వేయకూడదని, రాత్రి 10.30 లోపే చివరి షో పడిపోవాలని దాని ప్రకారం డిసెంబర్ 5 న విడుదల కాబోతున్న పుష్ప 2కి అనుమతులు లేవంటూ వెంటనే ప్రదర్శనలు ఆపాలని అందులో పేర్కొన్నారు. అమృత, అంజన్, బాలాజీ, బృంద, శ్రీకృష్ణ, వెంకటేశ్వర, లక్ష్మి, సిద్దేశ్వర, వినాయక, స్వాగత్, బాలాజీ, త్రివేణి తదితర 42 థియేటర్ల పేర్లు, షో టైంస్ తో సహా అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

టికెట్లు కొన్న వాళ్ళు, బుక్ మై షోలో కొన్నవాళ్ళకు చెల్లించిన సొమ్ము రీ ఫండ్ రూపంలో రాబోతోంది. ఇది పుష్ప 2 నెంబర్ల మీద దెబ్బ కొట్టనుంది. ఎందుకంటే రద్దైన షోలకు రావాల్సిన జనం మళ్ళీ అంతే సంఖ్యలో చూస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా టాక్ పూర్తి పాజిటివ్ గా వస్తేనే మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు తప్పించి లేదంటే పెద్ద రిస్క్ పొంచి ఉంది. గతంలో ఇదే బెనిఫిట్ షోలు వేసినప్పుడు సైలెంట్ గా ఉన్న అసోసియేషన్ కేవలం పుష్ప 2ని టార్గెట్ చేసుకోవడం ఏమిటని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. తమిళనాడులో తుఫాను, కర్ణాటక ఇప్పుడీ క్యాన్సిలేషన్లు చూస్తుంటే ఆదిలోనే ఎన్ని అడ్డంకులో.