పుష్ప 2 సంభవం మరికొద్ది గంటల్లో!

మరికొద్ది గంటల్లో పుష్ప 2 ది రూల్ సంభవం జరగనుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుష్పరాజ్ భీభత్సం మొదలుకాబోతోంది. తొలుత పరిమిత ప్రీమియర్లు వేయాలనుకున్నప్పటికీ డిమాండ్ అంతకంతా పెరిగిపోవడంతో చాలా సెంటర్లలో మూడు నుంచి నాలుగు ఆటలు హౌస్ ఫుల్స్ పడబోతున్నాయి. కొన్ని బిసి సెంటర్లలో టికెట్ రేట్ అధికంగా ఉండటం వల్ల ఆక్యుపెన్సీ నెమ్మదిగా కనిపిస్తున్నా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మాత్రం టికెట్ ముక్క దొరికే పరిస్థితి లేదు. రేపు దాదాపుగా ఏబిసి తేడా లేకుండా హైదరాబాద్ నుంచి చిత్తూరు దాకా అన్ని సోల్డ్ అవుట్ బోర్డులే కనిపిస్తున్నాయి. టాక్ వస్తే వీకెండ్ దాకా ఇదే సీన్ ఉంటుంది.

ట్రేడ్ టాక్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే పుష్ప 2 ది రూల్ 125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ నెంబర్ పెరగనుంది. తమిళనాడులో తుఫాను కారణంగా అక్కడి వసూళ్ల మీద ప్రభావం పడేలా కనిపిస్తున్నా కర్ణాటక, కేరళలో రికార్డులు నమోదయ్యేలా ఉంది. హిందీ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో టికెట్లు దొరకాలంటే భారీ పలుకుబడి ఉపయోగిస్తే తప్ప ఫలితం లేనట్టుంది. ప్రీ రిలీజ్ లోనే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తుండటంతో నాన్ రాజమౌళి రికార్డులు కాస్తా నాన్ పుష్ప రికార్డ్స్ గా మారతాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కావాల్సిందల్లా మిడ్ నైట్ వచ్చే టాక్ బ్లాక్ బస్టర్ కు తగ్గకపోవడం.

ఒకవేళ అదే జరిగితే మాత్రం గురువారం నుంచి ఆదివారం దాకా పుష్ప 2కి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. దేశంలోని దాదాపు అన్ని ఐమ్యాక్స్ లు దీనికే ఇచ్చేశారు. దెబ్బకు పెద్ద ఎత్తున రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఇంటర్ స్టెల్లార్ కు షోలు దొరకక నామమాత్రపు విడుదలతో సరిపెడుతున్నారు. ఏ భాషలోనూ కాంపిటీషన్ లేకపోవడం పుష్ప 2కి చాలా సానుకూలంగా మారబోతోంది. ఇవాళ రాత్రి ఆర్టిసి క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం ప్రీమియర్ కు అల్లు అర్జున్ స్వయంగా వచ్చి తన ర్యాంపేజ్ ని తెరమీద, థియేటర్లో రెండు చోట్ల చూడబోతున్నట్టు సమాచారం. చూడాలి ఏఏ రికార్డులు సెలవు తీసుకుంటాయో.