ఈ తరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కొందరిని చూస్తే.. వాళ్ల డెడికేషన్‌కు ఆశ్చర్యం కలగక మానదు. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా.. కొన్ని నెలల్లోనే మన భాష నేర్చేసుకుంటారు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. ఇంకా సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధం అన్నట్లుంటారు. కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా ఆ కోవకే చెందుతుంది. ఆమెను మన ప్రేక్షకులు పర భాషా కథానాయిక లాగా చూడరు. మనమ్మాయే అనుకుంటారు.
కెరీర్ ఆరంభం నుంచే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఎంతో డెడికేషన్‌తో పని చేస్తూ సాగిపోతోంది. ఆమె సినిమా కోసం పడే కష్టం, తన పెర్ఫామెన్స్ గురించి కోస్టార్స్ అందరూ ప్రశంసలు కురిపిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ సైతం తన శ్రీవల్లి మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమె డెడికేషన్ గురించి ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు.‘పుష్ప-2’ నుంచి చివరగా రిలీజ్ చేసిన ‘పీలింగ్స్’ పాటను కొన్ని రోజుల కిందటే చిత్రీకరించింది చిత్ర బృందం. ముందు సినిమాలో ఈ పాట అనుకోలేదు. చివర్లో యాడ్ చేశారు. షూట్ కూడా చివరగా జరిగింది. ఓవైపు బన్నీ, రష్మిక ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు.
పాట్నాలో ఈవెంట్ అయ్యాక ఈ పాటను రెండు మూడు రోజుల పాటు రేయింబవళ్లు చిత్రీకరించారు. అర్ధరాత్రి ప్యాకప్ అయితే మళ్లీ ఉదయం 8.30కి షూట్‌లో ఉండాలని, తాను అయినా ఓ పావు గంట ఆలస్యం చేసేవాడినని.. కానీ రష్మిక మాత్రం 8.30కే సెట్లో ఉండేదని బన్నీ వెల్లడించాడు. రెండు రోజుల పాటు విరామం లేకుండా షూట్ చేసిన తర్వాత చెన్నైలో ఈవెంట్ పెట్టుకున్నామని.. అక్కడికి వచ్చిన రష్మికను చూస్తే కళ్లు ఎర్రగా మారిపోయాయని.. నిద్ర పోలేదా అంటే లేదని చెప్పిందని.. ఇది తన డెడికేషన్‌కు ఒక ఉదాహరణ అని బన్నీ చెప్పాడు. తను పడ్డ కష్టానికి ఎంత పేరు రావాలో అంతా వస్తుందని బన్నీ ఆశాభావం వ్యక్తం చేశాడు.