సినిమాలకు సంబంధించి థియేటర్లు, ఓటిటిల మధ్యే పోటీ ఉండటం చూశాం కానీ తాజాగా ఇప్పుడీ లిస్టులో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాపులు చేరుతున్నాయి. ఇప్పటిదాకా ప్రధానంగా ఉన్న ప్లేయర్లు రెండే. ఒకటి బుక్ మై షో, మరొకటి పేటిఎం. నైజామ్ కు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా ఆధారపడేది మొదటిదానిమీదే. ఎప్పటికప్పుడు గంటకు, రోజుకు ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయనే సమాచారం ఇస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ సైతం దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటుంది. పేటిఎం వాడకం జిల్లా కేంద్రాలు, బిసి సెంటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఇప్పుడో కొత్త ఆటగాడు వచ్చాడు.
పుష్ప 2 ది రూల్ అధికారిక టికెటింగ్ పార్ట్ నర్ గా కొత్తగా అవతరించిన ‘డిస్ట్రిక్ట్’కి మంచి పబ్లిసిటీ దక్కుతోంది. అలాని ఇదేమి కొత్త కంపెనీ కాదు. గతంలో ఉన్న టికెట్ న్యూని నడిపిస్తున్న పేటిఎం కొత్తగా జొమాటోతో జట్టు కట్టి డిస్ట్రిక్ట్ యాప్ ని సృష్టించింది. ఊరికే లాంచ్ చేస్తే జనాలకు చేరదు కాబట్టి పుష్ప 2తో కొలాబరేట్ కావడం వల్ల కోట్ల రూపాయల ప్రమోషన్ జరిగిపోతుంది. పేటిఎంలో వందలాది సర్వీసులు ఉంటే డిస్ట్రిక్ట్ లో మాత్రం కేవలం సినిమాలు, ఈవెంట్ల టికెట్ల అమ్మకాలు మాత్రమే ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే బుక్ మై షోకి సరైన ప్రత్యాన్మయంగా దీనికి శ్రీకారం చుట్టారన్న మాట.
ఇప్పుడీ డిస్ట్రిక్ట్ ప్రభావం బుక్ మై షో మీద ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటి కన్నా ముందు పుష్ప 2 టికెట్లు దీంట్లోనే ఉంటాయనే ప్రచారం ఊపందుకోవడంతో సినీ ప్రియులు ఆలస్యం చేయకుండా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. కాకపోతే మొత్తం దేశమంతా టికెట్లు అందుబాటులోకి వచ్చాక అంత ట్రాఫిక్ ని ఈ కొత్తగా పుట్టుకొచ్చిన యాప్ తట్టుకుంటుందో లేదో చూడాలి. బలమైన సర్వర్లు ఉన్నప్పటికీ సలార్ టైంలో బుక్ మై షో గంటల తరబడి క్రాష్ అయ్యింది. మరి పుష్ప సునామిని ముందే ఊహించి డిస్ట్రిక్ట్ ని దానికి తగ్గట్టు సంసిద్ధం చేశారో లేదో షోలు, స్క్రీన్లు పెరిగే కొద్దీ ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది.