తమన్నా ఆశలు నీరుగార్చిన సికందర్!

ఇండస్ట్రీకి వచ్చిన పదిహేనేళ్ళు అవుతున్నా మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ బిజీ హీరోయిన్లలో ఒకరు. స్టార్లతో ఇప్పుడు జోడి కట్టడం లేదు కానీ వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్, మీడియం బడ్జెట్ సినిమాలు ఇలా వరస ఆఫర్లతో డైరీ ఖాళీ లేకుండా చూసుకుంటోంది. ఆమె తాజా ఓటిటి రిలీజ్ సికందర్ కా ముకద్దర్. అమితాబ్ బచ్చన్ లెజెండరీ బ్లాక్ బస్టర్ పేరుని రివర్స్ పెట్టిన దర్శకుడు నీరజ్ పాండే నెట్ ఫ్లిక్స్ కోసం భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించాడు. నిన్నటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా చేయని సరికొత్త పాత్రంటూ తమన్నా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో తెగ చెప్పుకొచ్చింది.

తీరా చూస్తే ఈ సికందర్ కా ముకద్దర్ అంచనాలు అందుకునేలా లేదు. అత్యంత ఖరీదైన డైమండ్ ఎగ్జిబిషన్ లో వందల కోట్ల విలువ చేసే నాలుగు ఎర్ర వజ్రాలు దొంగతనం చేయబడతాయి. అనుమానితుల్లో కామిని సింగ్ (తమన్నా) ఉంటుంది. కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన జస్విందర్ సింగ్ (జిమ్మీ షెర్గిల్) కు దీన్ని ఎలా ఛేదిస్తాడనేది అసలు స్టోరీ. లైన్ పరంగా ఆసక్తికరంగానే ఉన్నపటికీ దాన్ని రెండున్నర గంటల సేపు సాగదీయడానికి పడిన ప్రయాస ఒకదశ దాటాక బోర్ కొట్టేస్తుంది. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరొందిన నీరజ్ పాండే నుంచి ల్యాగ్ ఏ మాత్రం ఊహించలేం. కానీ ఇందులో జరిగింది.

కొన్ని ఎపిసోడ్లు, ట్విస్టులు బాగానే సెట్ చేసినప్పటికీ బలహీనమైన కథనాన్ని అవి నిలబెట్టలేకపోయాయి. పదిహేనేళ్ల క్రితం మొదలైన చోరీ కేసుగా చూపించి దాన్ని ఇప్పటికీ పరిష్కరించలేకపోయినట్టు చూపించే క్రమంలో దానికి అవసరమైన లాజిక్స్, క్యారెక్టరైజేషన్లు సరైన మోతాదులో పడలేదు. తమన్నా, జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారి తదితరులు పెర్ఫార్మన్స్ పరంగా శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ టేకింగ్ లోపాల వల్ల సికందర్ కా ముకద్దర్ బెస్ట్ ఛాయస్ కాలేకపోయింది. తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. విపరీతమైన ఖాళీ సమయం ఉంటే ట్రై చేయడానికి తప్ప ఎలాంటి ప్రత్యేకత లేకపోయింది.