ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన తమిళ హీరో సిద్దార్థ్.. తర్వాత ఇక్కడ వరుస ఫ్లాపులు ఎదురవడంతో కోలీవుడ్లోకి వెళ్లిపోయాడు. అక్కడే సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ అక్కడ కూడా ఈ మధ్య సరైన విజయం లేదు సిద్ధుకు చిత్తా (తెలుగులో చిన్నా) మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ మిస్ యు మీదే ఉన్నాయి. నా సామి రంగతో ఆకట్టుకున్న ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్. ప్రోమోలు చూస్తే మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ చిత్రం శుక్రవారమే విడుదల కావాల్సి ఉంది.
ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చి సినిమాను ప్రమోట్ చేసంది టీం. సిద్ధు ఆ సందర్భంగా పాల్గొన్న ప్రెస్ మీట్ ఆసక్తికరంగా సాగింది. వచ్చే వారం పుష్ప-2 లాంటి పెద్ద సినిమా వస్తున్న నేపథ్యంలో మీకు ఇబ్బంది లేదా అని అడిగితే.. విషయం ఉన్న సినిమాను ఎవ్వరూ అడ్డుకోలేరని, తమకు ఆ సినిమా విషయంలో ఎలాంటి భయం లేదని.. భయపడితే వాళ్లే పడాలన్నట్లుగా మాట్లాడాడు సిద్ధు.
ఆ రోజు తన కాన్‌ఫిడెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే ఇప్పుడు మిస్ యు సినిమా అనూహ్యంగా వాయిదా పడిపోయింది. విడుదలకు రెండు రోజుల ముందు వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ఐతే ఇందుకు చిత్రమైన కారణం చెప్పింది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోందని.. వర్షాల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని.. వాళ్ల క్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.
ఐతే తమిళనాట వర్షాలు పడుతున్న మాట వాస్తవమే కానీ.. ఆ కారణంతో విడుదలకు రెండు రోజుల ముందు సినిమాను వాయిదా వేయడంలో ఆంతర్యమేంటి అని ఆశ్చర్యపోతున్నారు. పుష్ప-2 సినిమాకు తమిళనాట కూడా మంచి హైపే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు. మిస్ యు అసలిక్కడ బజ్ యే లేదు. అందరి దృష్టీ పుష్ప-2 మీదే ఉంది. దానికి భయపడే మిస్ యు టీం సినిమాను వాయిదా వేసి ఉంటుందని.. వర్షాలను సాకుగా మాత్రమే చూపిస్తోందని సోషల్ మీడియా జనాలు అభిప్రాయపడుతున్నారు. లేదు లేదంటూనే సిద్ధు అండ్ టీం పుష్ప-2కు భయపడిందని కామెంట్లు చేస్తున్నారు.