పుష్ప 2 ది రూల్ ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలో అడుగు పెట్టిన అల్లు అర్జున్ బృందానికి ఘన స్వాగతం లభించింది. కోచి ఎయిర్ పోర్ట్ లో అభిమాన సందోహం చూసి అక్కడి స్టాఫ్ నోరెళ్లబెట్టారంటే అతిశయోక్తి కాదు. ఫ్యాన్స్ అరుపులకు కారు ఎక్కబోతున్న బన్నీ చెవులు మూసుకునే దాకా పరిస్థితి వచ్చిందంటే ఐకాన్ స్టార్ యుఫోరియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాట్నా, చెన్నై తరహాలోనే ఇక్కడా విపరీతమైన స్పందన కనిపించడం నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆర్య నుంచే బన్నీకి కేరళలో ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పడి ప్రతి సినిమాకు అది అంతకంతా పెరుగుతూ పోయింది.
ఇంత అభిమానం ఇచ్చిన మల్లువుడ్ ప్రేక్షకులకు బన్నీ కొన్ని సర్ప్రైజులు ఇచ్చాడు. వాటిలో మొదటిది పీలింగ్స్ అనే త్వరలో విడుదల కాబోయే పాట. సినిమా ఆరు భాషల్లో విడుదలవుతున్నప్పటికీ తొలి భాగంలో వచ్చే లిరిక్స్ అన్ని వెర్షన్లలో మలయాళంలోనే వినిపిస్తాయని, ఇది దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి తాను ప్రత్యేకంగా ఇక్కడి అభిమానుల కోసం చేయించిన కానుకని చెప్పడంతో స్టేడియం చప్పట్లలో మారుమ్రోగిపోయింది. అంతేకాదు పుష్ప 1లో పెద్దగా డాన్స్ చేసే అవకాశం రాకపోవడం వెలితిగా ఉండేదని, ఇందులో మాత్రం పాత అల్లు అర్జున్ ని చూస్తారని ఊరించడం మాములుగా పేలలేదు.
సాంగ్ లో కొంత శాంపిల్ ని స్టేజి మీదే ప్లే చేయించిన అల్లు అర్జున్ ఈ పాట చూశాక రష్మికని ఇకపై క్రష్ మిక అని పిలుస్తారని చెప్పడం చూస్తే అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయిదు సంవత్సరాలుగా పుష్ప మీదే పని చేస్తున్న బన్నీ రేంజు డాన్సుల కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగానే దర్శకుడు సుకుమార్ తన మార్కు నృత్యాలను జోడించినట్టు కనిపించింది. నిన్నటిదాకా కిస్ కిస్సిక్కు దెబ్బలు పడతాయి గురించే జరిగిన చర్చ తాజాగా పీలింగ్స్ వైపు షిఫ్ట్ అయ్యేలా ఉంది. వినిపించింది కొన్ని సెకండ్లే అయినా ప్రభావం అలా ఉంది.