ఈ మధ్య ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమా రిలీజైన సందర్భంగా చిత్ర బృందం ఓ థియేటర్‌కు వెళ్తే.. అక్కడ సినిమా ప్రదర్శన పూర్తయ్యాక ఒక మహిళ వచ్చి ఇందులో విలన్ పాత్ర చేసిన నటుడి మీద దాడికి పాల్పడింది. సినిమాలో అతను వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని కూతురినే చంపేస్తాడు. ప్రేక్షకులు సినిమాలో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
ఈ మధ్యే హఠాత్తుగా చనిపోయిన తమిళ నటుడు డేనియల్ బాలాజీ.. కమల్ సినిమా ‘వేట్టయాడు విలయాడు’లో విలన్‌గా సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ఇచ్చాక ఓ మాల్‌లోని లిఫ్ట్‌లో అతణ్ని చూసిన అమ్మాయిలు బెంబేలెత్తిపోయి పరుగెత్తారట. ఇప్పుడు టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జాకు ఇలాంటి విచిత్ర అనుభవం ఎదురైంది. కాకపోతే అతడి మీద ఎవరూ దాడి చేయడమో, అతణ్ని చూసి భయపడి పారిపోవడమో చేయలేదు. ఒక పెద్దాయన అతడికి పాదాభివందనం చేయడం విశేషం.గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ ఫిలిం ఫెస్టివల్‌కు టాలీవుడ్ తరఫున అతిథిగా వెళ్లాడు తేజ. ఇక్కడ అతను హీరోగా నటించిన ‘హనుమాన్’ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం తేజ స్టేజ్ మీదికి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తుండగా.. గుబురు గడ్డంతో ఉన్న ఒక పెద్దాయన వచ్చి తేజ కాళ్లకు మొక్కి ఆశ్చర్యపరిచాడు.
ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన తేజ.. ఆ పెద్దాయన్ని వారించే ప్రయత్నం చేశాడు. ‘హనుమాన్’ సినిమాలో హనుమంతుడు తేజ ఆవహించిన పాత్రలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన ఎవ్వరికైనా ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుందనడంలో సందేహం లేదు. ఆ భావనతోనే ఆ పెద్దాయన తేజకు పాదాభివందనం చేసినట్లున్నాడు. పురాణ పురుషుల పాత్రలతో సరైన సినిమాలు తీస్తే ప్రేక్షకుల మీద ఏ స్థాయి ఇంపాక్ట్ ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates