డబుల్ ఇస్మార్ట్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా రాపో 22 ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంటోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఇది రూపొందనుంది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. రెగ్యులర్ మాస్ కు దూరంగా ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాలను టార్గెట్ చేసేలా ఒక విభిన్నమైన కథను డిజైన్ చేసుకున్నట్టు యూనిట్ టాక్. కీలకమైన విషయం ఏంటంటే ఇందులో రామ్ ఒక్కడే హీరో కాదు. మరో ముఖ్యమైన పాత్ర ఉందట.
నిడివి పరంగా ఒకటే కాకపోయినా ప్రాధాన్యత ప్రకారం పోల్చుకుంటే రామ్ తో సమానంగా ఈ క్యారెక్టర్ జర్నీ ఉంటుందని అంటున్నారు. దీని కోసం దర్శకుడు మహేష్ బాబు పెద్ద స్టార్లనే లక్ష్యంగా పెట్టుకున్నాడట. కమల్ హాసన్ పేరు అధిక శాతం రికమండ్ చేస్తుండగా ఆయన డేట్లు అందుబాటులో ఉండటం కష్టమేనని వినికిడి. రజనీకాంత్ అయితే ఇంకా బాగుంటుంది కానీ ఆయన చేసే అవకాశాలు చాలా తక్కువ. వీళ్ళ కన్నా బెటర్ ఆప్షన్, మంచి కాంబినేషన్ అనిపించుకోవాలంటే బాలకృష్ణని అడిగే ఆలోచనలో ఉన్నారట. ఇంకా కలిసింది లేనిది తెలియలేదు కానీ వేట అయితే తీవ్రంగా కొనసాగుతోంది.
రామ్ గతంలో మల్టీస్టారర్ చేశాడు. మసాలాలో వెంకటేష్ తో స్క్రీన్ పంచుకున్నప్పటికీ బాక్సాఫీస్ ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ కు అత్యవసరంగా ఓ బ్లాక్ బస్టర్ పడాలి. హరీష్ శంకర్ కూడా ఒక కథ చెప్పాడు కానీ దానికన్నా ముందు మహేష్ బాబుది అయితేనే వర్కౌట్ అవుతుందని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చెప్పుకోదగ్గ మల్టీస్టారర్ తెలుగులో రాని నేపథ్యంలో తిరిగి రామ్ దానికి శ్రీకారం చుడతాడేమో చూడాలి. 2025 వేసవిలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఆలస్యమైతే దసరాకు రావడం ఖాయమనుకోవచ్చు.