బాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ ఒకడు. గత ఏడాది జనవరి 25కు ముందు షారుఖ్ ఖాన్ పరిస్థితి అగమ్యం గోచరం. పఠాన్ బ్లాక్ బస్టర్ కావడానికి ముందు పదేళ్లలో నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేక షారుఖ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ముఖ్యంగా పఠాన్ కంటే ముందు వచ్చిన జీరో సినిమా అతడి మార్కెట్‌ను దారుణంగా దెబ్బ తీసింది. ఆ సినిమా ఫలితం చూసి షారుఖ్ పనైపోయినట్లే అని చాలామంది తీర్మానించేశారు.
ఈ దెబ్బతో రెండేళ్లకు పైగా సినిమానే చేయలేదు షారుఖ్. చాలా గ్యాప్ తీసుకుని చేసిన పఠాన్‌తో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తర్వాత జవాన్, డంకీ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఐతే వరుస ఫెయిల్యూర్లలో ఉన్నపుడు ఎలాంటి హీరో అయినా కుంగిపోవడం ఖాయం. తాను కూడా ఎంతో మనో వేదనను అనుభవించానని.. కానీ ఎప్పుడూ తన ఫెయిల్యూర్లకు ఎవరినీ నిందించలేదని చెబుతున్నాడు షారుఖ్. దుబాయ్‌లో జరిగిన ఓ వేడుకలో షారుఖ్ తన కెరీర్లో బ్యాడ్ ఫేజ్ గురించి మాట్లాడాడు.
నా కెరీర్ గురించి ఎవరినో నిందించడం నాకు ఇష్టముండదు. నేను బాత్రూముల్లో ఏడ్చిన సందర్భాలున్నాయి. కానీ నా బాధను ఎవరి ముందూ చూపించను. ఎందుకంటే నా బాధను నేను దిగమింగుకోగలను. మనకు వ్యతిరేకంగా ఈ ప్రపంచం కుట్ర చేస్తోందని ఎప్పుడూ అనుకోకూడదు. ఈ ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉండదు. కొన్నిసార్లు మన తప్పు కూడా ఉండకపోవచ్చు. అయినా ఫెయిల్యూర్లు ఎదురవుతాయి. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.
మన పని సరిగా లేదని మనం అంగీకరించాలి. తర్వాత ముందుకు సాగిపోవాలి. నోర్మూసుకుని లేచి పని చూస్కో అని మనకు మనం చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో మనం ఓ చిన్న చీమ అని అర్థం చేసుకోవాలి. ప్రపంచం తన పని తాను చేసుకుపోతుంటుంది. వైఫల్యాలకు ఎవరినో నిందిస్తూ కూర్చోకుండా మన పని మనం చేయాలి అంటూ తన ఫిలాసఫీ గురించి.. తాను ఫెయిల్యూర్ ఫేజ్‌ను ఎలా దాటిందీ గుర్తు చేసుకున్నాడు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో ఒకే ఏడాది మూడు వేల కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా గత ఏడాది షారుఖ్ రికార్డు సృష్టించాడు.