రాజమౌళి-సెంథిల్.. ఏం జరిగింది?

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా కీరవాణి తప్ప మరో సంగీత దర్శకుడు పని చేయలేదు. సినిమాటోగ్రఫీ విషయంలో సెంథిల్ కుమార్ ఎక్కువ చిత్రాలు చేశాడు రాజమౌళికి. ముఖ్యంగా ‘మగధీర’ లాంటి భారీ చిత్రానికి పని చేశాక.. తనతో బాగా సింక్ అయిన వరుసగా ఆ తర్వాత తీసిన చిత్రాలన్నింటికీ సెంథిల్‌నే ఛాయాగ్రాహకుడిగా పెట్టుకున్నాడు.

రాజమౌళి కోరుకున్న భారీతనాన్ని తీసుకురావాలన్నా, విజువల్స్ అద్భుతంగా అందించాలన్నా సెంథిల్‌కే సాధ్యం అన్న అభిప్రాయం ఉండేది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు. జక్కన్న కొత్త చిత్రానికి పీఎస్ వినోద్ ఛాయాగ్రాహకుడిగా ఎంపికయ్యారు. సెంథిల్ దర్శకత్వం చేయాలనుకుంటున్నాడని.. అందుకే బ్రేక్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.

ఐతే సెంథిల్ రాజమౌళికి దూరమైన రెండేళ్లు దాటింది. కానీ తన డైరక్టోరియల్ మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ బయటికి రాలేదు. అతను నిఖిల్ మూవీ ‘స్వయంభు’కు పని చేస్తున్నాడు. దీంతో సెంథిల్ కావాలని బ్రేక్ తీసుకోవడం కాదు. రాజమౌళే అతణ్ని వద్దనుకున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

రాజమౌళి-మహేష్ సినిమాకు పని చేయకపోవడం, జక్కన్నతో సంబంధాల గురించి సెంథిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం స్వయంభు సినిమాకు పని చేస్తున్నా. నేను పెద్ద, చిన్న సినిమాలు అని చూడను. మంచి అవకాశం వస్తే ఏ సినిమాకైనా పని చేస్తా. మహేష్-రాజమౌళి సినిమాకు నేను పని చేయడం లేదు. తన సినిమాలోకి ఎవరిని తీసుకోవాలన్నది పూర్తిగా దర్శకుడి నిర్ణయం. మా మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయనడం వాస్తవం కాదు. ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. కొత్త సినిమాకు వేరే టెక్నీషియన్ అయితే బాగుంటుందని ఆయన భావించి ఉండొచ్చు. రాజమౌళి గతంలోనూ వేరే సినిమాటోగ్రాఫర్లలో పని చేశారు కదా” అని సెంథిల్ నర్మగర్భంగా మాట్లాడాడు. మరి జక్కన్న చేసే తర్వాతి సినిమాకైనా మళ్లీ ఆయన జట్టులోకి సెంథిలో చేరతాడేమో చూడాలి.