డబ్బులెక్కడివని సోనూ సూద్‌ను అడిగితే..

లాక్ డౌన్‌ టైంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. దేశవ్యాప్తంగా ఫిలిం సెలబ్రెటీలు ఈ సమయంలో తమ వంతుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ.. సోనూ లాగా పరిమితులు విధించుకోకుండా అసాధారణ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్విరామంగా సహాయ కార్యక్రమాలు చేసిన వాళ్లు ఇంకెవ్వరూ కనిపించరు.

ఏకంగా 20 వేల మంది దాకా వలస కార్మికులను బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపడమే కాదు.. కష్టాల్లో ఉన్న మరెంతో మందికి అడగ్గానే సాయం చేశాడు. ఇందుకు ఎన్ని కోట్లు అయ్యాయో లెక్క గట్టలేని పరిస్థితి. మరి బాలీవుడ్లో మీడియం రేంజ్ నటుడైన సోనూకు ఇన్ని డబ్బులెక్కడివి.. ఇంత సాయం అతను ఎలా చేయగలగుగుతున్నాడు అని చాలామందిలో సందేహాలున్నాయి.

ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. సమాధానం చెప్పాడు సోనూ. తాను ఆర్థికంగా జనాలు అనుకునే దానికంటే మంచి స్థితిలోనే ఉన్నట్లు సోనూ చెప్పాడు. ఈ సేవా కార్యక్రమాల్లో తన ఒక్కడి భాగస్వామ్యం మాత్రమే లేదని.. ఎంతో మంది సాయం చేస్తున్నారని కూడా వెల్లడించాడు.

‘‘ముందు నుంచి మా కుటుంబానికి లోటు లేదు. మాకు వ్యాపారాలున్నాయి. నేను మోడలింగ్‌తో పాటు సినిమాలు చేసి బాగానే సంపాదించాను. వాటితో ముందుగా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాను. తర్వాత మంచి మనసున్న చాలా మంది చేతులు కలిపారు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎంతో మంది సాయం వల్లే అని నమ్ముతా. ప్రస్తుతం తలపెట్టిన సేవా కార్యక్రమాలకు ఎంతోమంది ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేస్తున్నారు. వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు’’ అని సోనూ సూద్ తెలిపాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారన్న వ్యాఖ్యల గురించి సోనూ స్పందిస్తూ.. ‘‘నేను నిస్వార్థంగా ఈ సేవ చేస్తున్నా. ఏదీ ఆశించలేదు. కొన్ని పార్టీల నుంచి నేతలు నన్ను ఆహ్వానించారు. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’’ అని స్పష్టం చేశాడు.