భలే మంచి మట్కా ఛాన్సు

Varun Tej

దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తో సందడి చేశాక మొన్న శుక్రవారం కొత్త రిలీజులేవి బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాయి. ఉన్నంతలో ధూమ్ ధామ్, జితేందర్ రెడ్డి కొంచెం సౌండ్ చేశాయి కానీ జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు సరిపోలేదు. టాక్స్, రివ్యూస్ మరీ బ్యాడ్ గా లేకపోయినా క్యాస్టింగ్ సమస్యలతో పాటు ఇతరత్రా కారణాలు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించాయి. దీంతో వీకెండ్ కి తిరిగి దివాలి పటాసులే అవసరమయ్యాయి. అందుకే రెండో శని ఆదివారాల్లో దుల్కర్, కిరణ్ అబ్బవరం, శివ కార్తికేయన్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది.

ఇక ఇప్పుడు నవంబర్ 14 వస్తోంది. అందరి దృష్టి కంగువ మీద ఎక్కువగా ఉంది కానీ సైలెంట్ కిల్లర్ గా దిగుతున్న మట్కాని తక్కువంచన వేయడానికి లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి ఛాన్స్. పోటీలో ఉన్న మరో సినిమా దేవకీనందన వాసుదేవ నవంబర్ 22కి వాయిదా పడటంలో బరిలో రెండే మిగిలాయి. కంగువ ఎంత విజువల్ గ్రాండియర్ అయినా అటవీ తెగల మధ్య జరిగే ఆధిపత్యపు డ్రామా కాబట్టి సామాన్య మాస్ కి ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. ఒకవేళ క్లిక్ అయితే వసూళ్లు హోరెత్తిపోతాయి. రికార్డులు గల్లంతవుతాయి. అయినా సరే మట్కాకు అవకాశాలు తెరిచే ఉంటాయి.

ఎందుకంటే వరుణ్ తేజ్ ఈసారి రిస్క్ లేకుండా కంప్లీట్ మాస్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. ఒక మాములు వైజాగ్ కూలి వందల కోట్ల నేర సామ్రాజ్యానికి అధిపతిగా మారే క్రమాన్ని చాలా ఇంటెన్స్ గా తీశానని దర్శకుడు కరుణకుమార చెబుతున్నాడు. సో కంటెంట్ కనక తెరమీద పేలితే మూడు డిజాస్టర్ల తర్వాత వరుణ్ తేజ్ కో హిట్టు దక్కుతుంది.

పైగా లక్కీ చార్మ్స్ మీనాక్షి చౌదరి, జివి ప్రకాష్ కుమార్ ఇప్పుడీ మాట్కాలోనూ ఉన్నారు. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో వరుణ్ ఎడతెరిపి లేకుండా నార్త్ నుంచి సౌత్ దాకా ప్రమోషన్లు చేసేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు. మంచి ఫలితమే రావాలి.