అక్కినేని హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్లు అయి చాలా కాలం అయిపోయింది. ఇటు అక్కినేని నాగార్జున.. అటు నాగచైతన్య, అఖిల్ వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డారు. నాగ్ మూవీ ‘నా సామి రంగ’ ఓ మోస్తరుగా ఆడింది కానీ.. అభిమానులు కోరుకునే కిక్కు మాత్రం ఇవ్వలేదు.
చైతూ, అఖిల్‌ల పరిస్థితి అయితే ఘోరంగా తయారైంది. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ ‘తండేల్’ మీదే నిలిచాయి. ఈ సినిమా తమ కరవు తీర్చే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే వాళ్లకు ఆ భరోసా కలిగింది.
ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఐతే ‘తండేల్’ను క్రిస్మస్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేస్తారనుకుంటే.. అలా కాకుండా ఫిబ్రవరి 7కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం అభిమానులకు రుచించడం లేదు.
ఫిబ్రవరి 7 డేట్ గురించి ముందు నుంచే ప్రచారం మొదలు కాగా.. అక్కినేని ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ వారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముందు ప్రకటించినట్లు క్రిస్మస్‌కే రిలీజ్ చేయాలని.. కుదరదంటే సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్‌ను ఎంచుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ నిన్న వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఫిబ్రవరి 7కు సినిమాను ఫిక్స్ చేశారు.
క్రిస్మస్‌కు సినిమాను రెడీ చేసే అవకాశం లేకపోవడం.. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండడం, సోలో రిలీజ్ అయితే ఎక్కువ థియేటర్లు వస్తాయనే కారణంతో సినిమాను వాయిదా వేసినట్లు టీం వివరణ ఇచ్చుకోగా.. దాంతో అక్కినేని ఫ్యాన్స్ సంతృప్తి చెందడం లేదు.
ఓవైపు వంద కోట్ల క్లబ్బులో సినిమాను నిలబెడతాం అని చెబుతూ.. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడం ఏంటని.. సంక్రాంతికి థియేటర్లు తగ్గినా రెవెన్యూ ఎక్కువ వస్తుందని.. ఎంత పోటీ ఉన్నా సరే సినిమా బాగుంటే దానికే ప్రేక్షకులు ఎక్కువగా వెళ్తారని.. కాబట్టి సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.
సంక్రాంతి సంప్రదాయాలను పాటించాలని అల్లు అరవింద్ పేర్కొనడంపై స్పందిస్తూ.. పండక్కి దిల్ రాజు బేనర్ నుంచి రెండు సినిమాలు రిలీజవుతున్నపుడు.. ‘తండేల్’ను పోటీలో నిలబెడితే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి క్రేజీ పండుగ సీజన్లను వదిలేయడం అక్కినేని అభిమానులకు ఎంతమాత్రం రుచించడం లేదన్నది వాస్తవం.