ఇంత‌కీ తండేల్ అంటే ఏంటి?

తండేల్.. టాలీవుడ్లో తెర‌కెక్కుతున్న ఆస‌క్తిక‌ర చిత్రాల్లో ఇదొకటి. కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా చ‌ర్చే జ‌రిగింది. స‌స్పెన్సుకు తెర‌దించుతూ విడుద‌ల తేదీని టీం అధికారికంగా ప్ర‌క‌టించేసింది. ఈ చిత్రం క్రిస్మ‌స్‌కూ రావ‌ట్లేదు. అలాగ‌ని సంక్రాంతికీ రిలీజ్ కాదు. సోలోగా ఫిబ్ర‌వ‌రి 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి టీం నిర్ణ‌యించింది. దీని గురించి వెల్ల‌డిస్తూ టీం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఈ సంద‌ర్భంగా తండేల్ అంటే అర్థం ఏంటి అనే ప్ర‌శ్న‌కు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.

తండేల్ అంటే నాయ‌కుడు అని అర్థం అని.. దీని గురించి మ‌రింత వివ‌రించ‌డానికి మ‌రో ప్రెస్ మీట్ పెడ‌తామ‌ని అత‌ను చెప్పాడు. తండేల్ అనే ప‌దం విన‌డానికి బాగానే అనిపించింది కానీ.. ఇప్ప‌టిదాకా దీనికి అర్థం చాలామందికి తెలియ‌దు. ఇది ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో పాపుల‌ర్. జాల‌రులు ఈ ప‌దాన్ని వాడ‌తార‌ని స‌మాచారం.

మ‌రోవైపు తండేల్ సినిమాను వంద కోట్ల క్ల‌బ్బులో నిల‌బెడ‌తామ‌ని నిర్మాత బ‌న్నీ వాసు స‌వాలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాయిప‌ల్ల‌వి లేటెస్ట్ మూవీ అమ‌ర‌న్ వంద కోట్ల క్ల‌బ్బులో చేర‌డం, ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఆమె సినిమాల‌ను బాయ్‌కాట్ చేయాల‌ని సోషల్ మీడియాలో ఉద్య‌మాలు జ‌రగ‌డం గురించి బ‌న్నీ వాసును ప్ర‌శ్నించ‌గా.. వివాదాస్ప‌ద అంశం గురించి ఆయ‌న స్పందించ‌లేదు. కానీ తండేల్ క‌చ్చితంగా వంద కోట్ల క్ల‌బ్బులోకి వెళ్తుంద‌ని, సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, పెద్ద హిట్ అవుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

తండేల్ మూవీ నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌విలిద్ద‌రికీ నేష‌న‌ల్ అవార్డులు తీసుకొస్తుంద‌ని అల్లు అర‌వింద్ ధీమా వ్య‌క్తం చేశారు. సినిమాలో వాళ్లిద్ద‌రి పెర్ఫామన్స్ చాలా బాగుంటుంద‌ని ఆయ‌న చెప్పారు. తండేల్‌ను సంక్రాంతికి రిలీజ్ చేస్తార‌ని ఇటీవ‌ల బాగా ప్ర‌చారం జ‌ర‌గ్గా.. తాము ఎప్పుడూ అలాంటి ఆలోచ‌న చేయ‌లేద‌ని చెప్పిన అర‌వింద్.. సోలో డేట్ బాగుంటుంద‌నే ఫిబ్ర‌వ‌రి 7ను ఎంచుకున్నామ‌ని, ఇది మంచి డేట్ అని ఆయ‌న చెప్పారు.